WhatsApp Parental Controls: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ పిల్లల ఆన్‌లైన్ భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన కూడా పెరుగుతోంది. ముఖ్యంగా టీనేజర్లు వాట్సప్‌లో చాటింగ్, గ్రూప్స్, ఛానెల్స్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ మాతృ సంస్థ మెటా టీనేజ్ వినియోగదారుల భద్రత కోసం కొత్త పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్లను తీసుకొచ్చింది. వీటి ద్వారా పిల్లల గోప్యతకు భంగం కలగకుండా వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు మరింత అవగాహన పొందవచ్చు.
టీనేజర్లు ఏ వాట్సప్ గ్రూప్‌లో చేరుతున్నారు, ఎప్పుడు గ్రూప్ నుంచి బయటకు వస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు ఉన్న గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగినా పేరెంట్స్‌కు అలర్ట్ అందుతుంది. దీంతో తెలియని వ్యక్తులు ఉన్న గ్రూప్స్ విషయంలో తల్లిదండ్రులు ముందుగానే అప్రమత్తం కావచ్చు.
Also Read: ఇంటినే థియేటర్‌గా మార్చే Noise Soundbar.. ధర రూ.4,999 నుంచే!
కొత్త పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నప్పటికీ పిల్లల వ్యక్తిగత చాట్స్‌ను తల్లిదండ్రులు చదవలేరు. వాట్సప్‌లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కొనసాగుతుంది. అంటే.. చాట్‌లో పాల్గొనే వ్యక్తులకు మాత్రమే సందేశాలు కనిపిస్తాయి. మెటా లేదా పేరెంట్స్ కూడా పిల్లల ప్రైవేట్ మెసేజ్‌లను యాక్సెస్ చేయలేరు.
పిల్లల ప్రొఫైల్ ఫొటో, స్టేటస్‌ను ఎవరు చూడాలి, వారిని గ్రూప్‌లలో ఎవరు యాడ్ చేయాలి వంటి ప్రైవసీ సెట్టింగ్స్‌ను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. టీనేజర్లు ఈ సెట్టింగ్స్ మార్చాలనుకుంటే పేరెంట్స్ సెట్ చేసిన పిన్ అవసరం అవుతుంది. వాట్సప్ ఛానెల్స్, మెటా ఏఐ వినియోగంపై కూడా పరిమితులు విధించే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్లను తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చర్చించుకుని సెట్ చేసుకునేలా మెటా రూపొందించింది. దీని ద్వారా భద్రతతో పాటు పిల్లల వ్యక్తిగత గోప్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వొచ్చు. కొత్త ఫీచర్లు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వాట్సప్‌లో ఖాతా తెరవడానికి అవసరమైన కనీస వయస్సు 13 ఏళ్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు.
Also Read: ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!