Mark Butcher On IND VS PAK: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు ఎప్పుడు జరిగినా ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ సంఘటన తర్వాత ఇప్పటికే చాలా మ్యాచ్ లు ఈ రెండు టీమ్స్ మధ్య జరిగాయి. ఆసియా కప్ 2025 నుంచి మొదలు కొని, టి20 ప్రపంచ కప్ 2026 వరకు చాలా మ్యాచుల్లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచులు జరిగాయి. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అటు మహిళా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు కూడా పాకిస్తాన్ కెప్టెన్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే దీనిపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ బచెర్ (Mark Butcher) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్ల పట్ల చాలా దుర్మార్గంగా బీసీసీఐ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్ ప్లేయర్లను గౌరవించి.. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. అదే క్రీడా స్ఫూర్తిని సూచిస్తుందని మార్క్ బచెర్ వెల్లడించారు. దీనిపై బీసీసీఐ ఆలోచన చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పహాల్గమ్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో 20కి పైగా యాత్రికులు మృతి చెందారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బిసిసిఐ ఆదేశాలు ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే సూర్య కుమార్ యాదవ్ కూడా చాలా సార్లు పాకిస్తాన్ కెప్టెన్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇచ్చే ఆస్కారం కనిపించడం లేదు. అయితే ఈ నో హ్యాండ్ షేక్ వివాదం పైన తాజాగా మార్క్ బచెర్ (Mark Butcher) స్పందించారు.
ఇది అంతర్జాతీయ క్రికెట్ అని.. ఈ నేపథ్యంలో ఇరు జట్ల క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం వల్ల ప్లేయర్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు తెగిపోతాయని ఆగ్రహించారు. స్నేహపూర్వక వాతావరణం ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఉండాలంటే, బిసిసిఐ విధించిన ఈ నో హ్యాండ్ షేక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లను గౌరవించాలని కోరారు మార్క్ బచెర్ (Mark Butcher).
పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై విమర్శలు చేసిన మార్క్ బచెర్ (Mark Butcher) వ్యాఖ్యలకు సంజయ్ మంజ్రేకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణకాండ కు తెరలేపారని.. అలాంటి వాళ్లకు తగిన శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. ఆ విషయం గురించి మాట్లాడకుండా.. నో హ్యాండ్ షేక్ గురించి కొంతమంది అనవసరంగా మాట్లాడి.. ఇండియాను కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనే ప్లేయర్ల మధ్య గౌరవం, క్రీడా స్ఫూర్తి వ్యక్తం అవుతుందని ఎవరు చెప్పారంటూ మండిపడ్డారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోయినా ఇరుజట్ల క్రికెటర్లు బాగానే ఆడుతున్నారని పేర్కొన్నారు.