Abhishek Sharma: భారత్ మరియు దాయాది దేశం పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల ప్రజలలో ఎక్కడా లేని ఆసక్తి నెలకొంటుంది. కానీ పాకిస్తాన్ లా ఇంగ్లాండ్ టీమ్ మనకేమీ దాయాది కాదు. అయినప్పటికీ ఇంగ్లాండ్ అంటే భారతీయులకు, ముఖ్యంగా పంజాబ్ క్రికెటర్లకు ఒక రకమైన పగ. క్రికెట్ కి తాము పుట్టినిల్లు అని చెప్పుకునే ఇంగ్లాండ్ దేశం.. వందల ఏళ్ల పాటు పాలకులుగా మనపై ఆధిపత్యం చూపించిన దేశమది. అందుకే వాళ్లు పరిచయం చేసిన క్రికెట్ ఆట ద్వారానే వాళ్లకు సమాధానం ఇస్తుంది టీమిండియా.
Also Read: Mukesh Ambani: అభిషేక్ శర్మకు.. ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ?
సంవత్సరాలుగా ఉన్న పగ, కోపాన్ని వీలు దొరికినప్పుడల్లా క్రికెట్ రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ తీర్చుకుంటుంది. తాజాగా ఇంగ్లాండ్ పై అభిషేక్ శర్మ చేసిన విధ్వంసంతో పంజాబీలకు ఇంగ్లాండ్ పై ఉన్న పగ ఇదేనంటూ ఓ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. కోహినూర్ వజ్రం గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ కోహినూరు వజ్రం పుట్టుక గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది చాలామంది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కొల్లూరులో దొరికిందని చెబుతారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వజ్రం కాకతీయ రాజులు, మొఘల్ రాజకుమారులు, పర్షియన్, ఆఫ్ఘన్ పాలకులు, పంజాబ్ మహారాజులు.. ఇలా అనేకమంది చేతులు మారి చివరకు లండన్ చేరిందని చెబుతారు. 1813లో ఆఫ్గన్ పాలకుల నుండి పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ ఈ కోహినూరు వజ్రాన్ని దక్కించుకున్నారు. ప్రతిఫలంగా ఆఫ్గాన్ సింహాసనం షా షుజా దక్కించుకునేందుకు రంజిత్ సింగ్ సహాయం చేశాడు. ఇక రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన బ్రిటిష్ వారు పంజాబ్ పై దండెత్తారు.
ఈ క్రమంలో సిక్కు రాజులకు, బ్రిటిష్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ తరుణంలో 1849లో పంజాబ్ ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పంజాబ్ రాష్ట్ర ఆస్తిని కూడా జప్తు చేసుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ క్రమంలోనే కోహినూర్ వజ్రాన్ని లాహోర్ లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అందుకే ఇంగ్లాండ్ అంటే భారతీయులు, ముఖ్యంగా పంజాబీలకు అంత పగ అంటూ ఓ టాపిక్ సాగుతోంది.
భగత్ సింగ్ నుండి మొదలుపెడితే.. గతంలో ఇంగ్లాండ్ పై క్రికెట్ లో యువరాజ్ సింగ్, ఇప్పుడు అభిషేక్ శర్మ.. ఈ పంజాబీలు ఇంగ్లాండ్ ని చితక్కొడుతున్నారంటూ చెబుతున్నారు. అప్పుడు స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ పోరాడితే.. ఇప్పుడు క్రికెట్ లో పంజాబీలు ఇంగ్లాండ్ కి చుక్కలు చూపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 18 సంవత్సరాల క్రితం 2007 టి-20 వరల్డ్ కప్ లో భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ అండ్రూ ఫ్లింటాప్.. యువరాజ్ సింగ్ తో వైరం పెట్టుకున్నాడు.
Also Read: Abhishek Sharma: యూవీ చెప్పిందే చేశా.. 16వ ఓవర్ సీక్రెట్ చెప్పిన అభిషేక్
దీంతో రెచ్చిపోయిన ఈ పంజాబీ వీరుడు ఏకంగా 6 బంతులలో 6 సిక్సులు బాది అతడికి చుక్కలు చూపించాడు. అంతేకాదు కేవలం 12 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ ని చిత్తుగా ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు అతడి శిష్యుడు అభిషేక్ శర్మ కూడా ఇంగ్లాండ్ బౌలర్లని ఊచకోత కోశాడు. దీంతో ఎన్నేళ్లు గడిచినా ఈ పగ చల్లారదని భారత జట్టు మరోసారి స్పష్టం చేసింది.