BCCI: ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఇప్పటిదాకా అంచనాలకు మించి రాణించలేదు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తో ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తేలిపోతుందని క్రికెట్ నిపుణులు భావించారు. అందుకు తగ్గట్లుగానే ఆశించిన మేర రాణించలేకపోతున్నారు. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు నాలుగు టెస్టులు పూర్తయ్యాయి.
Also Read: T20 Records : 16 సిక్సర్లు, 44 ఫోర్లు.. 320 పరుగులు, అరుదైన రికార్డు
వీటిలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత జట్టు.. నాలుగవ టెస్ట్ ని డ్రా చేసుకుంది. మరో రెండు టెస్ట్ లలో ఓడిపోయింది. మూడవ టెస్ట్ లో కేవలం 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, అసిస్టెంట్ ర్యాన్ డస్కటే ని బీసీసీఐ తిరిగి తీసుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. బిసిసిఐ ఈ చర్యను ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు సమాచారం.
ఆసియా కప్ 2025 తర్వాత.. ఈ ఏడాది అక్టోబర్ లో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కి ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ డస్కాటే పై పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. బిసిసిఐ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం బౌలింగ్ కోచ్ గా మోర్నే మోర్కెల్ ఉన్నప్పటికీ.. భారత జట్టు బౌలింగ్ లో పెద్దగా మెరుగుదల రాలేదు. ఫీల్డింగ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అందుకే వీరిద్దరిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2025 టోర్నీ తర్వాత వీరిద్దరి స్థానాలను రీప్లేస్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రీడాభిమానులు. మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా సెలక్టర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. భారత జట్టు 14 టెస్ట్ లు ఆడింది. ఇందులో కేవలం నాలుగు విజయాలు మాత్రమే దక్కాయి. అందులో ఆస్ట్రేలియా పై 1, ఇంగ్లాండ్ లో ఒకటి పక్కన పెడితే.. మిగిలిన రెండు బంగ్లాదేశ్ పై దక్కాయి. దీంతో గంభీర్ కూడా తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఐదవ టెస్టులో భారత జట్టు గెలిచి తీరాల్సిందే.
కానీ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ గడువు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంది. కాగా ఆసియా కప్ 2025 టోర్నీలో ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం గంభీర్ తనంతట తాను హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పుకునే అవకాశాలు రావచ్చని సమాచారం. ఇక భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ లండన్ లోని ఓవల్ వేదికగా జూలై 31 నుండి ప్రారంభం కాబోతోంది. అయితే నాలుగోవ టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్ట్ కి దూరమయ్యాడు. అతడి స్థానాన్ని వికెట్ కీపర్ నారాయణన్ జగదీషన్ తో సెలక్టర్లు భర్తీ చేశారు.