Ambati Rayudu On Mumbai Indians: 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టి మళ్ళీ రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని అంబానీ ఫ్యామిలీ డిసైడ్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్ పై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
కోట్లల్లో వ్యాపారాలు చేస్తున్న ముఖేష్ అంబానీ అతని కుటుంబ సభ్యులు…. ముంబై ఇండియన్స్ జట్టును సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారని సెటైర్లు పేల్చారు. హార్దిక్ పాండ్యా విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. బాగా నడుస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు నెత్తిన గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చి పెట్టి పెద్ద తప్పు చేసిందని ఆగ్రహించారు. ఇక ఇప్పుడు మళ్లీ హార్దిక్ పాండ్యా ను పక్కకు పెట్టి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తాననడం బుద్ధి తక్కువ పని అని అంబటి రాయుడు మండిపడ్డారు.
నిజంగానే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటే… ముందుగా హార్దిక్ పాండ్యాను బయటకు పంపాలని కీలక సూచనలు అంబటి రాయుడు చేశారు. ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ జట్టులో ఉంటే రోజుకో పంచాయితీ తెరపైకి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ అన్నట్టుగా ముంబై ఇండియన్స్ జట్టు చీలిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలుసుకోకుండా మళ్ళీ హార్థిక్ పాండ్యాను జట్టులో ఉంచుతూనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే కష్టమేనన్నారు. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ మళ్ళీ ట్రాక్ లోకి రావాలంటే ఇద్దరిలో ఒకే ఒక్కరు మాత్రమే జట్టులో ఉండాలని కుండ బద్దలు కొట్టి చెప్పారు. తన అనుభవం ప్రకారం రోహిత్ శర్మాను కెప్టెన్ చేసి వేలంలో హార్దిక్ పాండ్యాను వదిలేయడం కరెక్ట్ అన్నారు.
హార్దిక్ పాండ్యాను వదిలేస్తే కొనుగోలు చేసేందుకు మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జట్లు సిద్ధంగా ఉన్నాయని అంబటి రాయుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతడిని వదిలేస్తేనే బెటర్ అన్నారు. తన అంచనా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా బాగా సెట్ అవుతాడని తెలిపారు. వాళ్లు వద్దనుకుంటే కేకేఆర్ కొనుగోలు చేసి కెప్టెన్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా అంచనా వేశారు అంబటి రాయుడు. హార్ధిక్ పాండ్యా ఏ జట్టులోకి వెళ్లినా, కెప్టెన్ కావడం గ్యారెంటీ అన్నారు.