World Champion Boxer Nikhat Zareen joins Telangana Police as DSP: ఆటల్లో రాణించాలేగానీ.. అటు అవార్డులతో పాటు.. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుందనడానికి మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఉదాహరణగా నిలిచింది. ఆడపిల్లలకు ఆటలెందుకని చెప్పే సగటు తల్లిదండ్రులకి కనువిప్పు కలగడమే కాదు.. అమ్మాయిలకు కూడా ఇన్సిపిరేషన్ గా నిఖత్ జరీన్ నిలుస్తోంది.
విషయం ఏమిటంటే.. మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ (స్పెషల్ పోలీస్) ఉద్యోగం కల్పించింది. జాయినింగ్ రిపోర్ట్ ను .. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్‌కు ఆమె అందజేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ 2022, 2023 పోటీల్లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నిఖత్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఇలా జరిగినా సరే.. గతంలో ఆమె ట్రాక్ రికార్డు ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్పీగా గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చి సత్కరించింది.
నిఖత్ కు గ్రూప్ 1 ఇచ్చేందుకు.. నిబంధనల పరంగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. అయితే.. ఈ విషయంపై కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సెక్షన్ 4.. తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు సవరణ చేయమని, తద్వారా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిఖత్ కి లైన్ క్లియర్ అయ్యింది.
Also Read: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !
గత ప్రభుత్వం నిఖత్‌కు నజరానతోపాటు, నివాస స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేయగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇచ్చింది. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి దేశ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే క్రీడాకారులని ఘనంగా సన్మానిస్తున్నారు. వారికి మంచి భవిష్యత్ ని ప్రభుత్వం తరఫున అందిస్తున్నారు.
తాజాగా పారాలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన దీప్తి జీవాంజికి కోటి నజరానా ప్రకటించారు. హైదరాబాద్ లో 500 గజాలా స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం అన్నీ కల్పించారు. అలాగే తనని ఇంతలా తీర్చిదిద్దిని కోచ్ కి రూ.10 లక్షలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. వీరందరి స్ఫూర్తితో తెలంగాణలో మరికొందరు క్రీడాకారులు ముందుకొస్తారని భావిస్తున్నారు. దీప్తి లాంటి క్రీడా నైపుణ్యం ఉన్న అమ్మాయిలను వెతకమని రేవంత్ రెడ్డి క్రీడాధికారులకు సూచించారు. క్రీడలను ప్రోత్సహించమని తెలిపారు.