IND Vs OMAN : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ లీగ్ దశలో టీమిండియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో ఇది చివరి మ్యాచ్ కావడం విశేషం. ఇక ఇప్పటికే గ్రూపు ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూపు బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4 కి అర్హత సాధించాయి. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు మారే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఒమన్ తో జరిగే పోరు నామ మాత్రం కావడంతో టీమిండియా తన ప్లేయింగ్ ఎలెవెన్ లో మార్పులు చేసేందుకు రెడీ అయింది.
Also Read : AFG Vs SL : ఆసియా కప్ లో శ్రీలంక ఘన విజయం.. అప్గాన్ ఔట్..!
ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఒమన్ తో జరిగే పోరులో వీరిని పక్కన పెట్టి వేరే ప్లేయర్లకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా స్పిన్నర్లు అదురగొట్టారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ యూఏఈ పై 4 వికెట్లు, పాకిస్తన్ పై 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ యూఏఈ పై 1 వికెట్, పాకిస్తాన్ పై 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వరుణ్ చక్రవర్తి టీ 20ల్లో నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీమిండియా స్పిన్నర్లను ఆడటంలో పాకిస్తాన్ తో పాటు ఇతర జట్లకు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు టోర్నీలో బౌలర్లు పెద్దగా కష్టపడింది లేదు. యూఏఈ పై కేవలం టాప్ ఆర్డర్ లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్ పై టాప్ 5 బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు. టోర్నీలో ఇప్పటివరకు సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒమన్ తో జరిగే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి బ్యాటర్లకు ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీమిండియా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఒమన్ జట్టు ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్, రెండో మ్యాచ్ యూఏఈతో ఓటమి చెందిన ఒమన్.. మూడో మ్యాచ్ టీమిండియాతో తలపడనుంది. ఒమన్ జట్టు పాకిస్తాన్ కి గట్టిగానే పోటీ ఇచ్చింది. కానీ యూఏఈ కి మాత్రం పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒమన్ బౌలింగ్ అద్బుతంగా చేసింది. కానీ బ్యాటింగ్ లో విఫలం చెందింది. నామమాత్రంగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని ఎవ్వరైనా చెబుతారు. కానీ ఈనెల 21న మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఆ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వనుంది. మరోసారి పాకిస్తాన్ తో మ్యాచ్ ఉండటంతో హైవోల్టేజ్ లా సాగుతుందని అభిమానులు పేర్కొంటున్నారు.