Champions Trophy: సరిగ్గా మరో 37 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ – 2025 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తలపడనుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు పెద్ద సమస్య వచ్చి పడింది. పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ లకు అతిథ్యం ఇవ్వనున్న స్టేడియాల జాబితాలో కరాచీ, లాహోర్, రావాల్పిండి మైదానాలు ఇంకా సిద్ధం కాలేదని, ఓ స్టేడియంలో కనీసం ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తిగా లేదని వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Tamim Iqbal: అంతర్జాతీయ క్రికెట్‌కు రెండోసారి తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ?
మైదానాలకు సంబంధించి చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఈ పనులన్నీ 2024 డిసెంబర్ 31 లోగా పూర్తి కావాల్సింది. కానీ ఇప్పటివరకు చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని, సమయం గడుస్తున్నప్పటికీ స్టేడియాలలో సీట్ల పునరుద్ధరణ, ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్స్ రేనోవేషన్, హాస్పిటాలిటీ బాక్పేస్, ఫ్లడ్ లైట్ ల ఏర్పాట్లు సహా ఇతర సౌకర్యాలకు సంబంధించిన పనులు ఏవి పూర్తి కాలేదని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ కథనాలపై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్పందించింది. స్టేడియాలు సిద్ధంగా లేకపోవడంతో పాకిస్తాన్ నుంచి ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణ వేరే దేశానికి వెళ్లనుందా..? అనే అనుమానపు వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సుమారు 12 బిలియన్ ( పాకిస్తాన్ రూపాయలు) వెచ్చించి స్టేడియాలను సిద్ధం చేశామని, దీనిపై అనుమానం అవసరం లేదని స్పష్టం చేసింది. స్టేడియాల సన్నద్ధతపై వచ్చిన వార్తల కారణంగా గందరగోళం ఉండకూడదని ఈ ప్రకటన విడుదల చేశామని పేర్కొంది.
పనులు వేగంగా జరుగుతున్నాయని.. టోర్నీ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ పనులన్నీ పూర్తి కావడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా రెండవ డెడ్ లైన్ విధించింది. జనవరి 25వ తేదీ నాటికి స్టేడియాలన్నీ పూర్తిగా సిద్ధం చేయాలని ఆదేశించింది. కానీ ఈ తేదీకి ఎక్కువ రోజుల సమయం లేదు. దీంతో ఫైనల్ డెడ్ లైన్ ని ఫిబ్రవరి 12న విధించింది.
అయితే స్టేడియాల పునరుద్ధరణ పట్ల పిసిబి ఆలస్య వైఖరిని క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు స్టేడియాల పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు ఐసీసీ నుంచి ఓ బృందం త్వరలో పాకిస్తాన్ లో పర్యటించనుందని సమాచారం. నిర్ణీత గడుపులోగా రినోవేషన్ పనులు పూర్తి చేయడం ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఓ పెద్ద సవాల్ గా మారింది.
Also Read: Ravindra Jadeja: టీమిండియాకు షాక్… మరో ఆల్ రౌండర్ రిటైర్మెంట్?
అయితే హైబ్రిడ్ మోడల్ విధానంలో భారత మ్యాచ్ లు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతానికి భారత్ కి వచ్చిన ఇబ్బందేం లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి స్టేడియాల పునరుద్ధరణ పనులు పూర్తి కాకుంటే, ఐసీసీ టోర్నీని మార్చాలని ఫిక్స్ అయితే దుబాయ్ కి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.