Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది భారత జట్టు. దీంతో సెమీస్ కి చేరుకుంది. ఇక ఈరోజు దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, భారత్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి.
అయితే మీకు 2023 వన్డే ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్ కు చేరిన జట్లు గుర్తున్నాయా. 2023 వన్డే ప్రపంచ కప్ లో కూడా భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. ఈ 2023 వన్డే ప్రపంచ కప్ లీగ్ దశలో భారత జట్టుకు తిరుగులేదు. ఆడిన 9 మ్యాచ్ లలోనూ గెలిచి టాప్ ప్లేస్ తో సెమీస్ చేరుకుంది. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గ్రూప్ ఎ లో ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించి సెమిస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది.
ఈ నేపథ్యంలో 2023 వరల్డ్ కప్ సీన్ రిపీట్ కాబోతుందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు. 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య చెన్నై వేదికగా అక్టోబర్ 8న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ని కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టి ముగించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరగగా.. ఈ మ్యాచ్ లో కూడా కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు.
అలాగే 2023 వన్డే ప్రపంచ కప్ లో భారత్ తన రెండవ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది. అక్టోబర్ 11న జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ చేజింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నాటౌట్ గా నిలిచి భారత జట్టును గెలిపించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన రెండవ మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా చేజింగ్ లో విరాట్ కోహ్లీ నాట్ అవుట్ గా నిలిచి భారత జట్టును గెలిపించాడు. అనంతరం 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది ఆఫ్ఘనిస్తాన్.
ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో కూడా ఇంగ్లాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. అలా ఇవే నాలుగు జట్లు అప్పుడు 2023 ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుకున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు కూడా ఇవే నాలుగు జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. కానీ ఆ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందింది. అంటే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని.. 2023 వరల్డ్ కప్ సీన్ రిపీట్ కాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.