IND vs BAN: అతిరథ మహారథులందరూ వెనుతిరిగారు. రోహిత్, కొహ్లీ, గిల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. ఒక దశలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశ నుంచి టీమ్ ఇండియా కోలుకున్నట్టు కనిపించినా…144 పరుగులకి వచ్చేసరికి 6 వికెట్లు పడిపోయాయి. దీంతో 200 పరుగులకే అంతా ఆలౌట్ అనుకున్నారు.
కానీ అప్పుడు ఇద్దరు వీరులు వచ్చారు. వారే ఆల్ రౌండర్లు…
38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్, 35 ఏళ్ల రవీంద్ర జడేజా…
144 పరుగుల వద్ద వచ్చిన వీరు ఎండ్ ఆఫ్ ది డే వరకు నాటౌట్ గా నిలిచారు. ఈ క్రమంలో వెటరన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. అది కూడా టెస్టు మ్యాచ్ సెంచరీలా కాదు…వన్డే తరహాలో ఆడి చూపించాడు. 112 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.
మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా ఆడాడు. తను 117 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 7 వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఒకర్ని మించి ఒకరు అద్భుతంగా ఆడుతూ మొత్తం ఆటని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇండియాని కష్టాల నుంచి గట్టెక్కించారు. మరోవైపు బంగ్లాదేశ్ కి త్వరగా వికెట్లు తీశామన్న ఆనందం లేకుండా చేశారు. స్పిన్నర్లని ఒక ఆటాడుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగుకి వచ్చిన టీమ్ ఇండియా ఓపెనర్లలో రోహిత్ శర్మ 19 బంతులాడి 6 పరుగులు మాత్రమే చేసి హసన్ మహ్ముద్ బౌలింగులో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జాగ్రత్తగా ఆచితూచి ఆడాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ ఎప్పటిలా తడబడుతూ ఆడి…డక్ అవుట్ అయ్యాడు. అనంతరం పరుగుల వీరుడు విరాట్ కొహ్లీ కూడా 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరిని కూడా హసన్ అవుట్ చేశాడు. అప్పటికి టీమ్ ఇండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 34 పరుగులుగా ఉంది.
అప్పుడు రిషబ్ పంత్ వచ్చి కాసేపు నిలదొక్కుకున్నాడు. యశస్వి ఇద్దరూ కలిసి గాడిలో పెడుతున్నారనే సమయానికి 37 పరుగులు చేసి తను అవుట్ అయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్ కూడా ఓవర్ డిఫెన్స్ ఆడి ఆడి 52 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వీళ్లతో పాటు నిలదొక్కుకున్న యశస్వి కూడా అవుట్ అయ్యాడు. 118 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు.
అలా 6 వికెట్లకి 144 పరుగుల వద్ద అశ్విన్, జడేజా ఇద్దరూ వచ్చారు. ఏదో టెస్టు మ్యాచ్ తరహాలో డిఫెన్స్ ఆడుతూ వెళ్లలేదు. వన్డే మ్యాచ్ తరహాలోనే దంచి కొట్టారు. ఎంతో స్లో ఉన్న రన్ రేట్ ని పెంచుతూ ధనాధన్ ఆడారు. చివరికిద్దరూ నాటౌట్ గా నిలిచారు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో టీమ్ ఇండియా పటిష్టమైన స్థితికి చేరుకుంది. రెండోరోజు కనీసం మరో 100 పరుగులైనా చేస్తే… లీడ్ లోకి వచ్చినట్టే అంటున్నారు. వీరిద్దరితో పాటు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నారు.
ఇక బంగ్లాదేశ్ బౌలింగులో హసన్ మహ్ముద్ 4, నహిద్ రాణా 1, మెహిది హాసన్ 1 వికెట్ పడగొట్టారు.