Ind vs Nz: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై అద్భుత విజయాలను సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీస్ కి దూసుకు వెళ్ళింది. ఇక మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో మరో మ్యాచ్ కి సిద్ధమవుతుంది. చివరి లీగ్ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. ఇక పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ తో జరగబోయే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే.. ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ఇప్పటికే భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ} అకాడమీలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా ఆటగాళ్లు ఫుట్ బాల్, రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు. నెట్ సెషన్ లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం హాజరు కాలేదు. దీంతో రోహిత్ శర్మ ఫిట్నెస్ పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఆ కారణంగానే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు చాలా తక్కువ అని సమాచారం. ఒకవేళ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయితే.. వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. తుది జట్టులో పలు మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ షమీ అసౌకర్యంగా కనిపించిన విషయం తెలిసిందే.
దీంతో షమీని కూడా న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కి పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయం కారణంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సరిగా బౌలింగ్ చేయలేక ఇబ్బంది పడ్డాడు మహమ్మద్ షమీ. ఐదవ ఓవర్ వేసిన అనంతరం మైదానాన్ని వీడి.. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ మైదానంలోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో 8 ఓవర్లు వేసిన షమీ.. ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో గాయాల సమస్యను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మహమ్మద్ షమీకి న్యూజిలాండ్ మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ మ్యాచ్ కి వీరిద్దరూ దూరం అయితే.. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇక రోహిత్ శర్మ స్థానంలో తుదిచెట్టులోకి రిషబ్ పంత్ చేరే అవకాశం ఉంది. పంత్ 5వ స్థానంలో క్రీజ్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక షమీ స్థానంలో అర్షదీప్ సింగ్ జట్టులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే భారత జట్టు సెమీస్ కి చేరుకున్న నేపథ్యంలో.. మార్చి 2న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కి వీరిద్దరూ దూరమైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదనే భావనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం.