India vs Sri Lanka, 2nd Semi-Final: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ తుది దశకు వచ్చేసింది. ఫైనల్స్ జట్లు కూడా ఖరారు అయిపోయాయి. ఏషియన్ గేమ్స్ రెండో సెమీ ఫైనల్స్ భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, సూపర్ విక్టరీ అందుకుంది. శ్రీలంకపై ఏకంగా 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ కు టీమిండియా దూసుకెళ్లింది. ఈ ఫైనల్స్ లో అందరూ ఊహించినట్టే పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో టాస్ ఓడిపోయి టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు. ఈ తరుణంలోనే 46 బంతుంలోనే 80 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు, 4 బౌండరీలు ఉన్నాయి. 173.91 స్ట్రైక్ రేట్ తో దుమ్ములేపి, టీమిండియా పరువు కాపాడాడు.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 38 పరుగులు మినహా, ఏ ఒక్కరూ సరిగ్గా ఆడలేదు. అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అటు మూడో స్థానంలో వచ్చిన సంజు శాంసన్ 7 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 13 పరుగులకే ప్యాకెప్ చెప్పాడు. ఇక టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక టీమ్ చెత్త ప్రదర్శన కనబరించింది. టీమిండియా బౌలర్ల దాటికి ఒక్కడు కూడా క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ తరుణంలోనే 9.5 ఓవర్లు ఆడిన శ్రీలంక 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో 124 పరుగుల తేడాతో టీమిండియా బిగ్ విక్టరీ అందుకుంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా బౌలర్లు ఇరగదీశారు. బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్ల పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసి రాణించారు. టీమిండియా బౌలర్ల దాటికి ఏకంగా 5 గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్ ఫెర్నాండో 15 పరుగులు మినహా ఎవరు కూడా సింగిల్ డిజిట్ దాటలేదు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్స్ మ్యాచ్ అక్టోబర్ 3వ తేదీన జరుగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. అయితే, ఫైనల్స్ కు వర్షం అంతరాయం కలిగిస్తే, కనీసం 5 ఓవర్ల మ్యాచైనా నిర్వహించే ఛాన్స్ ఉంది. ఒకవేళ రద్దు అయితే, రెండు జట్లు పతకాలను పంచుకోవాలి.