Kris Srikkanth On Bumrah and Mitchell Starc: టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై ( Jasprit Bumrah) సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఐపీఎల్ సమయంలో మనోడు బాగా ఆడి.. టీమిండియా అనే సరికి గాయం బారిన పడుతున్నాడని విమర్శలు కూడా వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఐపీఎల్ ఆడే మూడు నెలల పాటు బుమ్రా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడని… ఆ తర్వాత గాయం తిరగబడి, టీమ్ ఇండియాకు దూరం కావడం చాలా సార్లు జరిగిందని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) కూడా స్పందించారు. బుమ్రా పరువు తీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు ద్రోహం చేసి… ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడని బుమ్రాపై మండిపడ్డారు. బుమ్రా దుర్మార్గుడు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. టీమిండియాలో ఉండటం దండగే అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం సెలెక్ట్ అయిన టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరి క్షణంలో బుమ్రాను తప్పించింది బీసీసీఐ. జూలై చివరలో ఫిట్నెస్ పరీక్షకు వెళ్లి ఉత్తీర్ణుడు అయ్యాడు బుమ్రా. కానీ అంతలోనే అతడి గాయం తిరగబడినట్లు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే బిసిసిఐ కూడా శ్రీలంక సిరీస్ నుంచి తప్పించింది. ఈ క్రమంలో టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కృష్ణమాచారి శ్రీకాంత్. యార్కర్ల కింగ్ బుమ్రా కంటే ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ గ్రేట్ బౌలర్ అని ప్రశంసల వర్షం కురిపించారు. మిచెల్ స్టార్క్ ( Mitchell Starc) కేవలం తన జాతీయ జట్టు ఆస్ట్రేలియాకు ఆడేందుకు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లను తప్పించుకుంటాడని తెలిపారు. కానీ బుమ్రా మాత్రం ఐపీఎల్ కోసం టీమిండియాకు ఆడకుండా తప్పించుకు తిరుగుతాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా సిరీస్ లు అనగానే గాయం బారిన పడుతున్న బుమ్రా ( Bumrah)… ముంబై ఇండియన్స్ కోసం మాత్రం ప్రాణాలు ఇస్తాడని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వచ్చిందంటే చాలు.. బుమ్రాకు పండగ వాతావరణం ఉంటుందని వెల్లడించారు. వెంటనే ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడేందుకు బరిలోకి దిగుతాడని ఎద్దేవా చేశారు. టీమిండియాకు ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ గాయాల పేరుతో తప్పించుకుంటాడని ఆగ్రహించారు. ముకేశ్ అంబానీ ఇచ్చే డబ్బులకు మూడు నెలల పాటు బ్రేక్ లేకుండా పనిచేస్తాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లను టీమిండియా నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. అతని స్థానంలో మరో ప్రత్యామ్నాయ బౌలర్ను తీసుకోవాలని కోరారు.