LSG Mentor Zaheer Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో హోమ్ గ్రౌండ్ పిచ్ లపై మరో జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా తమ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో పిచ్ వల్లే తాము ఓడిపోయామని లక్నో సూపర్ జెయింట్స్ పేర్కొంది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ని ఓడించిన పంజాబ్, తాజాగా లక్నోపై ఘన విజయం సాధించింది.
Also Read: Mehar Ramesh – Ishan Kishan: ఇషాన్ కిషన్ కెరీర్ నాశనం చేసిన టాలీవుడ్ దర్శకుడు?
సోమవారం జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది లక్నో. ఈ మ్యాచ్ లో ప్రబ్ సిమ్రన్ 69 పరుగులు చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, చివర్లో నేహళ్ వధేరా 43 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ విజయం సాధించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తన జోరును కొనసాగించాడు. 43 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
పిచ్ స్లోగా ఉన్న నేపథ్యంలో ఈ లక్ష్య చేదన ఆసక్తికరంగా మారింది. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16.2 ఓవర్లలోనే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో తాము పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని, అందుకే తగిన విధంగా సిద్ధమయ్యామని, కానీ ఆశ్చర్యకరంగా పిచ్ పేసర్లకు సహకరించిందని వాపోయాడు లక్నో కోచ్ జహీర్ ఖాన్. లక్నో తమకు హోం గ్రౌండ్ అని, అందుకు తగిన విధంగా పిచ్ ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదని ప్రశ్నించాడు.
అయితే క్యూరెటర్లు మాత్రం స్పిన్ కి బదులుగా పేసర్లకు సహకరించేలా పిచ్ రూపొందించారని.. ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై క్యూరేటర్లతో మాట్లాడుతామని, భవిష్యత్తులో దీనిపై మరింత ఫోకస్ పెడతామని పేర్కొన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ పిచ్ నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పిన తర్వాత జహీర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
హోమ్ గ్రౌండ్ లో తమ జట్టు గెలుస్తుందనే అంచనాలతో ప్రేక్షకులు మైదానానికి వచ్చారని.. కానీ లక్నో పిచ్ నీ పంజాబ్ క్యూరేటర్ సిద్ధం చేసినట్టు అనిపించిందని, ఈ కారణంగా అభిమానులు నిరాశకు గురయ్యారని చెప్పుకొచ్చాడు జహీర్ ఖాన్. ఇక ఇదే విషయంపై కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మేము పిచ్ స్పిన్ కి అనుకూలిస్తుందని భావించి అందుకు తగిన విధంగా పేసర్ ప్రిన్స్ కి బదులు సిద్ధార్ధ్ ని తీసుకున్నామని.. కానీ పేసర్లకు సహకరించేలా పిచ్ ఉండడంతో తాము నష్టపోయామని పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో పిచ్ క్యూరేటర్ల నుండి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ పెసర్లు కలిసి ఐదు వికెట్లు పడగొట్టారు.