Big Stories

IPL 2024 LSG vs MI Highlights: ఉత్కంఠ పోరులో లక్నో గెలుపు.. ఆఖరి ఓవర్ వరకు పోరాడిన ముంబై

Lucknow Super Giants vs Mumbai Indians IPL 2024 Highlights: ఐపీఎల్ లో జరిగిన ఒక‘లో స్కోరు గేమ్’.. అలవోకగా లక్నో ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా వాళ్లు కూడా పీకలమీదకు తెచ్చుకుని, చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. మొత్తానికి తక్కువ పరుగులే అయినే మ్యాచ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది.

- Advertisement -

లక్నో లో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో లక్నో తడబడింది. 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఎట్టకేలకు 145 పరుగులు చేసి చచ్చీ చెడి గెలిచింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… 146 పరుగుల స్వల్ప లక్ష్యంతో లక్నో బ్యాటింగ్ కి దిగింది. అయితే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అలా 1 పరుగుకి 1 వికెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోని కెప్టెన్ కేఎల్ రాహుల్ (28) కాసేపు ఆదుకున్నాడు.  అయితే ఫస్ట్ డౌన్ వచ్చిన మార్కస్ స్టొయినిస్ మాత్రం ఇరగదీసి వదిలేశాడు. 45 బంతుల్లో 2 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది. అప్పటికే దీపక్ హుడా (13) కూడా అవుట్ అయ్యాడు.  ఆ వెంటనే స్టొయినిస్ అయిపోయాడు. అప్పుడు 14.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగుల మీదకి లక్నో వచ్చింది. 30 బంతులు.. 30 పరుగులుగా సమీకరణాలు మారాయి. చూడటానికి ఎంతసేపులే అనుకుంటే, ఠపీఠపీ మని మరో రెండు వికెట్లు పడ్డాయి.

Also Read: టీ20 ప్రపంచ కప్.. భారత జట్టు ఇదే

ఆస్టన్ టర్నర్ (5), ఆయుష్ బదాని (6) రన్ అవుట్ అయిపోయారు. అప్పటికి 18.1 ఓవర్ లో 6 వికెట్ల నష్టానికి 133 పరుగుల మీద పడుతూ లేస్తూ వెళుతోంది. అలా 12 బంతులు 12 పరుగులకు వచ్చింది. మొత్తానికి నికోలస్ పూరన్ (14 నాటౌట్) గా నిలిచి, కృనాల్ పాండ్యా (1) సహాయంతో మ్యాచ్ ని చచ్చీచెడి గెలిపించాడు. లో స్కోరు మ్యాచ్ కూడా ఇంత ఉత్కంఠ భరితంగా మారడంతో అందరూ టెన్షన్ టెన్షనుగా ఫీలయ్యారు.

ముంబయి బౌలింగులో నువాన్ తుషారా 1, కొయెట్జీ 1, హార్దిక్ పాండ్యా 2, మహ్మాద్ నబీ 1 వికెట్ పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఆదిలోనే దెబ్బ తగిలింది. ఇటీవల వరుసగా  విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈరోజే టీ 20 ప్రపంచకప్ జట్టును కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలో కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు.

మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (32)  రెండు లైఫ్ లతో కాసేపు నిలబడ్డాడు.  సూర్యకుమార్ యాదవ్ (10), తిలక్ వర్మ (7) రన్ అవుట్, హార్దిక్ పాండ్యా గోల్డెన్ డక్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన నెహాల్ వాధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) చేసి స్కోరును ఆ మాత్రమైనా ముందుకు లాగించారు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి ముంబై పరువు నిలబెట్టుకుంది.

లక్నో బౌలింగులో మొషిన్ ఖాన్ 2, మార్కస్ స్టొయినిస్ 1, నవీన్ ఉల్ హక్ 1, మయాంక్ యాదవ్ 1, రవి బిష్ణోయ్  1 వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో లక్నో మూడో స్థానంలోకి ఎగబాకింది. హైదరాబాద్ ఇప్పుడు 5 వ స్థానంలోకి వెళ్లిపోయింది. ఇక ఓడిన ముంబయి ఎప్పటిలాగే 9వ స్థానంలో చతికిలపడి కూర్చుంది. దీనికిందనే విరాట్ కొహ్లీ ఆర్సీబీ ఉండటం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News