MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 43 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో వికెట్ల వెనుక మెరుపు వేగంతో కళ్ళు చెదిరే స్టంపింగ్ చేస్తున్నాడు. ధోని మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే కేవలం హెలికాప్టర్ షాట్స్ తో సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదు.. కళ్ళు చెదిరే మెరుపు స్టంపింగ్స్ కూడా ఉంటాయి.
ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యధిక వయసు కలిగిన, అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడుతున్న ధోని.. అద్భుతమైన స్టంపింగ్స్ తో అదరగొడుతున్నాడు. శుక్రవారం రోజు 8వ మ్యాచ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నైలోని చెపక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ధోని మెరుపు స్టంపింగ్స్ తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సిబి ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో సాల్ట్ దూకుడుకు ధోని అడ్డుకట్ట వేశాడు. నూర్ అహ్మద్ వేసిన ఐదవ ఓవర్ లో సాల్ట్ ని ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. నూర్ అహ్మద్ వేసిన బంతికి ఫిల్ సాల్ట్ లైన్ మిస్ అయ్యాడు. షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్నించగా.. ఆ బంతి మిస్ అయ్యి ధోని గ్లోవ్స్ లోకి వెళ్ళింది. ఇంకేముంది.. రెప్పపాటు వేగంతోని బెయిల్స్ ని గిరాటేసి అప్పిల్ కి వెళ్ళాడు.
రిప్లై లో కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో సాల్ట్ కాలు గాలిలో ఉన్నట్లు కనిపించింది. కేవలం 0.141 సెకండ్స్ లో ఈ స్టంపింగ్స్ ని పూర్తి చేశాడు ధోని. దీంతో ధోని స్టంపింగ్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా భారత క్రికెటర్లను విమర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ధోని స్టంపింగ్ చూసి నివ్వెరపోయాడు. ధోని వేగం దిగ్భ్రాంతి కలిగించిందని అన్నాడు.
కాగా ధోని వికెట్ల వెనుక తన మెరుపు వేగాన్ని ప్రదర్శించడం ఇది వారం రోజులలో రెండవసారి. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ ని ఇలాగే రెప్పపాటు వేగంతో స్టంపింగ్ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ ని కేవలం 0.12 సెకండ్ లోనే స్టంపింగ్ తో పేవిలియన్ కి పంపాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన రెండవ స్టంపింగ్ రికార్డుగా నిలిచింది. మొదటి అత్యంత వేగమైన స్టంపింగ్ రికార్డును కూడా ధోనీనే సాధించాడు.
ఐపీఎల్ 2023 ఎడిషన్ లో ఫైనల్ లో గుజరాత్ ప్లేయర్ గిల్ ని కేవలం 0.1 సెకండ్లలోనే అవుట్ చేసి రికార్డుల మూత మోగించాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ స్టంపింగ్ రికార్డు కూడా ధోని పేరిటే ఉంది. 2018లో వెస్టిండీస్ కి చెందిన కీమో పాల్ ని కేవలం 0.08 సెకండ్లలో స్టంపింగ్ లో పెవిలియన్ కి చేర్చాడు. ఈ సీజన్ ఐపిఎల్ లో ధోనీకి సంబంధించిన రెండు స్టంప్ అవుట్లను పోలుస్తూ ఐపీఎల్ తన ఇంస్టాలో పోస్ట్ చేసింది. దానికి “అల్ట్రా ఫాస్ట్ స్టంపింగ్ అని పేర్కొంది. ఇలా ధోని స్టంపింగ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.