Paris Paralympics 2024 Rubina Francis wins bronze in air pistol SH1 event: పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో శుక్రవారం ఐదు పతకాలు సాధించిన భారత్.. శనివారం అంత దూకుడు చూపించలేకపోయింది. కేవలం ఒక్క కాంస్యంతోనే సరిపెట్టుకుంది. అది కూడా షూటింగులోనే వచ్చింది. మరో శుభవార్త ఏమిటంటే బ్యాడ్మింటన్ లో మరో పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్ ఇద్దరూ నేడు సెమీస్ లో తలపడనున్నారు. ఇకపోతే వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకు భారీ అంచనాలతో వెళ్లిన శీతల్ నిరాశపర్చింది.
షూటింగులో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం సాధించింది. మహిళల పీ2 10 మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ 1 విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచింది. 20 షాట్ల షూటింగ్ ముగిసే సరికి రుబీనా 193 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. కానీ చివరికి వెనుకపడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
బ్యాడ్మింటన్ లో పతకం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4లో సుకాంత్ సెమీస్ చేరాడు. ఇప్పటికే సెమీస్ లో అడుగుపెట్టిన సుహాస్ తో తలపడతాడు. ఇద్దరు భారతీయుల మధ్య పోటీ జరగడం, అది కూడా పతకం ఖాయం కావడంతో అభిమానుల ఆనందాలకు హద్దుల్లేకుండా పోయాయి.
Also Read: 19 సిక్సర్లు, 8 ఫోర్లు.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన ఆయుష్
ఎందుకంటే ఇక్కడ గెలిచి.. ఫైనల్లో తలపడిన వారికి రజత పతకం వస్తుంది. ఓడిన వారు మళ్లీ కాంస్యం కోసం పోరాడాలి. అక్కడ గెలిస్తే.. రెండు పతకాలు వస్తాయి. ఇక పారా ఆర్చరీలో శీతల్ దేవి ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. ఒకొక్క రౌండులో జరిగిన చిన్నచిన్న పొరపాట్లు తన కొంప ముంచాయి. చివరికి 137-138 పాయింట్ల తో మారియాన ( చీలి) చేతిలో పరాజయం పాలైంది.
ఇకపోతే ఏపీకి చెందిన పారా సైక్లిస్టు అర్షద్ మళ్లీ విఫలమయ్యాడు. పురుషుల సీ1-3 1000 మీ టైమ్ ట్రయల్ అర్హత రౌండ్లో తను 17వ స్థానంలో నిలిచాడు.
ఏపీకి చెందిన మరో క్రీడాకారుడు నారాయణ-అనిత జోడీ రోయింగ్ మిక్స్ డ్ పీఆర్ 3 డబుల్ స్కల్స్ లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో మరో పోరాటానికి సిద్ధమైంది.