Shahid Afridi On Virat Kohli: పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పొద్దున లేస్తే చాలు…టీమిండియా క్రికెటర్లను విమర్శిస్తూనే ఉంటారు. ఐపీఎల్ టోర్నమెంట్ ను ఉద్దేశించి వివాదాస్పద ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. టీమిండియా ఏదైనా మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ చేశారని హేళన చేస్తూ ఉంటారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇక ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే.. బ్యాట్లలో చిప్పులు పెట్టి ఆడారని అనుమానిస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. అతని ఫిట్నెస్ కు తాను ఫిదా అయిపోయానని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ లాంటివాడు పాకిస్తాన్ లో పుట్టి ఉంటే బాగుండు అని ప్రశంసలు కురిపించారు. దీంతో షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని కలిగి ఉండడం టీమిండియా అదృష్టం అని వెల్లడించారు. ఫార్మాట్ ఏదైనా సరే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి టీమిండియాను గెలిపిస్తున్నాడని తెగ పొగిడారు. టి20 లతోపాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ… వన్డేల్లో కూడా అద్భుతంగా రాణించడం చాలా గ్రేట్ అన్నారు. నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా విరాట్ కోహ్లీ 20 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడని కొనియాడారు షాహిద్ ఆఫ్రిది.
40 ఏళ్ల వయసులో కూడా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అద్భుతంగా ఉంటుందని… అతని ముందు పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరూ పనికిరారని ఇజ్జత్ తీశారు. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజాం చాలా గొప్ప ఆటగాడు అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడతారు.. కానీ తన దృష్టిలో విరాట్ కోహ్లీనే తోపు క్రికెటర్ అని ప్రశంసించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఉంటాడని… అలాంటోడు పాకిస్తాన్ లో పుట్టి ఉంటే బాగుండేదని మరోసారి గుర్తు చేశారు. టీమిండియా తరఫున ఆడి పాకిస్తాన్ జట్టును చాలా సార్లు విరాట్ కోహ్లీ ఓడించడానికి కూడా వెల్లడించారు.
టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయిన తర్వాత కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని వెల్లడించారు షాహిద్ అఫ్రిది. లండన్ లో రెస్ట్ తీసుకోకుండా ఏదైనా ఒక జట్టుకు కోచ్ గా ఉంటే అద్భుతంగా ఉంటుందని సూచనలు చేశారు. టీమిండియా కు పని చేయకపోతే పాకిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. పాకిస్తాన్ దేశానికి వచ్చి కోచ్ గా వ్యవహరిస్తానంటే విరాట్ కోహ్లీ కోసం తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒప్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. లండన్ లో ఉంటున్న విరాట్ కోహ్లీ, అక్కడి పౌరసత్వం తీసుకున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.