Shubman Gill: అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ {2025} లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ మొదటి టెస్ట్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత జట్టు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ ఓటమితో భారత జట్టు ఒక అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Also Read: Ishan Kishan – Abbas: వివాదంలో ఇషాన్ కిషన్.. పాకిస్తాన్ ప్లేయర్ కు హగ్గులు… బిసిసిఐ సీరియస్ !
ఓకే టెస్ట్ మ్యాచ్ లో 5 సెంచరీలు సాధించి కూడా ఓటమిని చవిచూసిన తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ తొలి టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇరుజట్ల ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 134, రెండవ ఇన్నింగ్స్ లో 118 పరుగులు సాధించాడు.
అలాగే యశస్వి జైస్వాల్ 101, గిల్ 147, కేఎల్ రాహుల్ 137.. సెంచరీలతో కదం తొక్కారు. ఈ ఐదు సెంచరీలతో భారత్ భారీ స్కోర్ లు సాధించినప్పటికీ.. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన 371 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. దీంతో ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆదిక్యంలోకి దూసుకెళ్లింది.
ముఖ్యంగా ఈ తొలి టెస్ట్ లో భారత ఓటమికి గల కారణాల విషయానికి వస్తే.. ఫీల్డింగ్ లో ఆరు క్యాచ్ లు వదిలేయడం, కెప్టెన్ గిల్ తీసుకున్న రివ్యూలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడం, మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల వికెట్లు పడగొట్టేందుకు బుమ్రా మినహా ఇతర బౌలర్ల నుంచి సహకారం అందకపోవడం, రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ వికెట్లు పడగొట్టడంలో బుమ్రా విఫలం కావడం, బెన్ డకెట్ {149} భారీ ఇన్నింగ్స్ ఆడడం. ఈ కారణాలవల్లే మొదటి టెస్ట్ లో భారత్ ఓటమి చెందిందని అంటున్నారు క్రీడా నిపుణులు.
అయితే ఈ ఓటమిపై కెప్టెన్ గిల్ ఏమన్నారంటే.. ” తొలి టెస్ట్ లో గెలిచేందుకు అవకాశాలు వచ్చినా చేజార్చుకున్నాం. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ పై అవకాశాలు అంత ఈజీగా రావు. కానీ మేము చాలా క్యాచ్ లు మిస్ చేశాం. అలాగే బ్యాటింగ్ లోను లోయర్ ఆర్డర్ పరుగులు చేయలేకపోయింది. నాలుగో రోజు కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని భావించాం. కానీ 25 పరుగులకే చివరిలో వరుసగా వికెట్లు పడడంతో అది సాధ్యం కాలేదు. రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాము. ఈ తప్పును మేము మున్ముందు సరిదిద్దుకోవాలి. టీం ఎఫర్ట్ పట్ల గర్వంగా ఉంది. మాది యంగ్ టీం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం” అని చెప్పుకొచ్చాడు గిల్.