Big Stories

SRH Vs LSG Highlights: ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాద్.. ఘోర పరాజయాన్ని చూసిన లక్నో!

c: ఏం ఆట…ఏం ఆట…కళ్లు చెదిరిపోయాయి…బంతులు తారాజువ్వల్లా స్టేడియంపైకి ఎగిరి పడ్డాయి. హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కలిసి 166 పరుగుల టార్గెట్ ని 9.4 ఓవర్లలో ఉఫ్ మని ఊదేశారు. లక్నో బౌలర్లని ఊచకోత కోశారు. అలాంటి ఇలాంటి విధ్వంసం కాదు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దఢ్ దఢ్ లాడింది. నిజానికి సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగుకి వచ్చి ఉంటే, అందరూ అంటున్నట్టు 300 దాటేద్దురేమో అనిపించింది. ఒకరకంగా లక్నో మొదట బ్యాటింగ్ చేసి బతికిపోయిందని అంతా అనుకున్నారు.

- Advertisement -

లక్నో టాస్ గెలిచి మొదట బ్యాటింగు తీసుకుంది. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక్కసారి 3వ స్థానానికి ఎగబాకింది.

- Advertisement -

టాస్ గెలిచిన  లక్నో వ్యూహాత్మక తప్పిదం చేసిందని అంతా అంటున్నారు. పిచ్ ని సరిగా అంచనా వేయలేకపోయిందని అంటున్నారు. మొదట తేమగా ఉన్నప్పుడు హైదరాబాద్ కి బ్యాటింగ్ ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. టాస్ గెలిచి మరీ కెప్టెన్  రాహుల్ మ్యాచ్ పోగొట్టుకున్నాడని అంటున్నారు. అయితే టాస్ నిర్ణయం తనదై ఉండదని, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Also Read: సంజూ శాంసన్ అవుట్.. వివాదాస్పదంగా ఢిల్లీ సహ యజమాని పార్త్ జిందాల్ తీరు

ఇక వివరాల్లోకి వెళితే 166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మామూలుగా కాదు, ఒకర్ని మించి ఒకరు టపాసులు పేల్చినట్టు పేల్చారు. బాల్ పిచ్ మీద పడటం భయం…వెళ్లి స్టాండ్ లో కూర్చునేది. ఎలా కొడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కళ్లు తెరిచి చూసేసరికి 9.4 ఓవర్లలో మ్యాచ్ అయిపోయింది. 166 పరుగులు చితక్కొట్టి పారేశారు.

ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 6 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. మరో విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ అయితే 30 బంతుల్లో 8 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. అంటే వీరిలో ఒక్కరిని కూడా లక్నో బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. నవీన్ ఉల్ హక్ వేసిన ఐదో ఓవర్‌లో 4, 4, 6, 4, 4 బాది 16 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Also Read: అయ్యో రోహిత్.. అలా చూస్తే బాధేస్తుంది..

అభిషేక్ శర్మ కూడా ఇదే రీతిలో ఆడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే 107 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో రెండు సార్లు 100 పరుగులు చేసిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

లక్నో బౌలింగులో  యష్ ఠాగూర్ 2.4 ఓవర్లలో 47 పరుగులు, రవి బిష్ణోయ్ 2 ఓవర్లలో 34 పరుగులు, నవీన్ 2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో ఆది నుంచి చాలా ఇబ్బంది పడింది. కొత్తగా క్రికెట్ నేర్చుకున్నవాళ్లు ఆడినట్టు ఆడారు. ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడారు. 10 ఓవర్లు గడిచేసరికి 3 వికెట్ల నష్టానికి 57 పరుగులతో పడుతూ లేస్తూ వెళుతోంది. ఇలా ఉంది పరిస్థితి. ఓపెనర్ డికాక్ (2) , మార్కస్ స్టోనిస్ (3) వెంటవెంటనే అయిపోయారు.

Also Read: CSK vs GT IPL 2024 Preview: సీఎస్కే ముందడుగు వేస్తుందా?.. నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్

కెప్టెన్ కేఎల్ రాహుల్ (29) ఒంటరి పోరాటం చేశాడు. కానీ లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు. మరోవైపు కృనాల్ పాండ్యా (24) కాసేపు నిలబడ్డాడు. అనంతరం నికోలస్ పూరన్ 26 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే ఆయుష్ బదానీ 30 బంతుల్లో 55 చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే బహుశా పిచ్ ఆ చివర్లో… వీరి కంట్రోల్ లోకి వచ్చినట్టుంది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఫలితం మారిపోయింది. మొత్తానికి లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

హైదరాబాద్ బౌలింగులో భువనేశ్వర్ 2, కమిన్స్ 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News