Suresh Raina On Rohit – Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. గిల్ సారధ్యంలోని టీమిండియాను అన్ని విభాగాల్లో బలంగా తయారు చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడితే టీమిండియా అవలీలగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెల్ల కాగితంపైన రాసి పెట్టుకోండి… వీళ్ళు బరిలోకి దిగితే టీమిండియాదే 2027 వరల్డ్ కప్ అంటూ సంచలన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ అనవసరంగా ఈ ఇద్దరినీ గౌతమ్ గంభీర్ గెలికితే మాత్రం… టీమిండియా గ్రూప్ స్టేజ్ లోనే 2007 తరహాలో ఎలిమినేట్ కావడం పక్కా అంటూ హెచ్చరించారు. దీంతో సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన పై సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 50 ఓవర్ల వరల్డ్ కప్ గెలవాలంటే టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారు. వీళ్ళిద్దరూ లేకపోతే టీమిండియా గెలవడం కష్టమేనన్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై బౌన్సర్లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఎదుర్కోగలుగుతారని వివరించారు. ఎన్నో టోర్నమెంట్లు ఆడిన అనుభవం ఈ ఇద్దరికి ఉందని… ఒత్తిడిలోనూ రాణించే కెపాసిటీ ఉన్న దమ్మున్న ఆటగాళ్లు అంటూ ప్రసంశించాడు.
అలాంటి ఆటగాళ్లను టీమిండియా యాజమాన్యం సరిగ్గా వినియోగించుకొని వరల్డ్ కప్ గెలవాలని సూచనలు చేశాడు. అనవసరంగా వీళ్లిద్దరిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని.. ఒకవేళ ఇద్దరిలో ఎవరిని గెలికినా టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. గౌతమ్ గంభీర్ ఈ మధ్య కాలంలో అనేక ప్రయోగాలు చేస్తున్నాడని.. ఇది వరల్డ్ కప్ కంటే ముందు ఏ మాత్రం క్షేమం కాదని తెలిపాడు. వరల్డ్ కప్ ఫినిష్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ ఏం చేసినా పర్లేదు కానీ..అనామక కుర్రాళ్లను వరల్డ్ కప్ లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని చురకలు అంటించాడు.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అటు రోహిత్ శర్మ ఆడడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలికి క్లియర్ స్టాండ్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వాళ్ళిద్దరినీ కచ్చితంగా జట్టులోకి తీసుకోవాల్సిందేనని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు బీసీసీఐకి సంబంధించిన అధికారులు తరచూ మీడియా సమావేశాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళిద్దరి అనుభవం టీమిండియాకు అవసరమని పేర్కొంటున్నారు.