Mohammad Nabi Son: క్రికెట్ లో మనం ఇప్పటివరకు అన్నదమ్ములు కలిసి ఒకే జట్టు తరుపున ఆడడం.. లేదా వేర్వేరు జట్లలో ఆడడం చూశాం. ఇలా యూసఫ్ పటాన్ – ఇర్ఫాన్ పటాన్, షాన్ మార్ష్ – మిచ్ మార్ష్, ఆండీ ఫ్లవర్ – గ్రాండ్ ఫ్లవర్.. ఇలా చాలామంది సోదరులు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడారు. కానీ తండ్రి కొడుకులు కలిసి ఒకే మ్యాచ్ లో ఆడడం చాలా అరుదు. తండ్రి కొడుకులు ఒకరి తరువాత ఒకరు ప్రాతినిథ్యం వహించిన సంఘటనలు మనం చాలా చూసాం.
Also Read: WCL 2025: అప్పుడు ధోని అవుట్.. కానీ ABD మ్యాచ్ నిలబెట్టాడు…. రన్ ఔట్ సీన్ రిపీట్
ఉదాహరణకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబైకి ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తో కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఆఫ్గనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ విషయంలో ఓ అరుదైన విషయం చోటుచేసుకుంది. మహమ్మద్ నబీ తన కుమారుడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. అంతేకాకుండా తండ్రి బౌలింగ్ లో కొడుకు ఏకంగా భారీ సిక్సర్ బాదడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్పాగేజా క్రికెట్ లీగ్:
ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ టి-20 క్రికెట్ టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ {SCL} లో భాగంగా 2025 జూలై 22న 8వ మ్యాచ్ లో అమోషార్క్స్ – మిస్ ఐనక్ జట్లు తలపడ్డాయి. అయితే మిస్ ఐనక్ నైట్స్ జట్టుకి మహమ్మద్ నబీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అమోషార్క్స్ జట్టు తరపున నబి కొడుకు హసన్ ఐసాఖిల్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా కాబుల్ వేదికగా మంగళవారం రోజు జరిగిన మ్యాచ్ లో నబి వేసిన తొలి బంతినే హసన్ సిక్స్ బాదాడు. మ్యాచ్ జరుగుతున్న 9వ ఓవర్ లో నబీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు.
అదే సమయంలో క్రీజ్ లో ఉన్న హసన్.. తండ్రి వేసిన మొదటి బంతిని స్వీప్ చేసి లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ గా మలిచాడు. ఈ షాట్ చూసిన మహమ్మద్ నబీ ఒక్క క్షణం అవాక్కయ్యాడు. కామెంటేటర్లు కూడా.. “ఇది మీ తండ్రి బౌలింగ్, కొంచెం గౌరవం చూపించు” అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. అయితే హాసన్ ఈ ఒక్క సిక్స్ మాత్రమే కాకుండా తన బ్యాటింగ్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. 36 బంతుల్లో 52 పరుగులు సాధించి.. జట్టు స్కోర్ ని పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక నబి ఆల్రౌండర్ కాగా.. హసన్ ఓ స్పెషలిస్ట్ బ్యాటర్. ఇప్పటివరకు 25 టి-20 మ్యాచ్ లు ఆడిన మహమ్మద్ నబీ కుమారుడు.. నాలుగు హాఫ్ సెంచరీలతో 599 పరుగులు చేశాడు. ఈ లీగ్ తొలి రెండు మ్యాచ్ లలో 6, 35 పరుగులు నమోదు చేశాడు. 18 ఏళ్ల హసన్ గతంలో 2024 అండర్ 19 ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడి.. తన ప్రతిభను చాటుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా తన అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Also Read: IND VS ENG, 4Th Test: మాంచెస్టర్ లో పిడుకులతో కూడిన వర్షం…ఇండియా VS ఇంగ్లాండ్ మ్యాచ్ వాయిదా ?
ఇక మహమ్మద్ నబీ గతంలో తన కుమారుడు హసన్ తో కలిసి ఆఫ్గనిస్తాన్ జట్టు తరుపున ఆడాలని ఉందని పలుమార్లు తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు నబీ. కానీ ఆ తరువాత తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు. తన కుమారుడితో ఆడాలనే కోరికతోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలో హాసన్ అద్భుతమైన ప్రదర్శనలతో త్వరలోనే జాతీయ జట్టులోకి అడుగు పెడతాడని, తండ్రి కొడుకులు కలిసి ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడే రోజు త్వరలోనే వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link