
World Cup Final : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఒక రేంజ్ లో జరగనుంది. ఏర్పాట్లు అదరహో అన్నట్టు జరిగిపోతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ కి ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ మోదీ స్టేడియం సిద్ధమైంది. అతిరథ మహారథులు అందరూ తరలి వస్తుండటం, ఇండియా ఫైనల్ కి చేరడంతో ప్రపంచ దేశాలన్నీ ముక్కు మీద వేలేసుకునేలా, ఒలింపిక్ గేమ్స్ ని తలపించేలా బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రోగ్రాం షెడ్యూల్ ని బీసీసీఐ విడుదల చేసింది. ఒక మెగా ఈవెంట్ కన్నా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టాస్ వేసిన అనంతరం 1.35 గంటల నుంచి 1.50 వరకు భారత వాయుసేన ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఎయిర్ బాటిక్ బృందం ఎయిర్ షో ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామంలో ప్రముఖ నేపథ్య గాయకుడు, గేయ రచయిత ఆదిత్య గద్వీతో సంగీత్ ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత తుషార్ జోషీ, ప్రీతమ్, జోనితా గాంధీ తదితరుల నేతృత్వంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సెకండ్ బ్యాటింగ్ లో మళ్లీ వచ్చే విరామ సమయంలో లేజర్ లైట్ షో ఉంటుంది.
ఇవికాకుండా అదనపు ఆకర్షణలు చాలా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ దువా లిపా దుమ్ము రేపే ప్రదర్శన ఒకటి ఉంది. యూకే కి చెందిన ఈ లేడీ సింగర్ కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. అందులో మన క్రికెటర్లు కూడా ఉన్నారండోయ్.. శుభ్ మన్ గిల్, రాహుల్, కేన్ విలియమ్సన్ అందరూ కూడా దువా లిపా ఏ పాట పాడుతుందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మరి తనకెంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చూశారు కదండీ…
ఇటీవల దువాలిపా పాడిన ‘హౌడిని ట్రాక్’రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇకపోతే ప్రపంచకప్ ముగింపు వేడుకల్లో దువా లిపా ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ కానుంది.