ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: సర్కార్ ఆఫీసుల్లో ‘కట్టల’ పాములు పుట్టలు పెట్టుకున్నాయి. న్యాయంగా చేయాల్సిన డ్యూటీలను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు అడ్డగోలుగా వెనకేసుకుంటున్నారు. చిన్న..పెద్ద అన్నది కాకుండా ప్రతీ పనికి ఓ రేటు కట్టి కట్టలు కట్టలుగా పోగేసుకుంటున్నారు. మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో బయటపడ్డ డబ్బు, బంగారం, ఆస్తుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్కొక్కరి ఇంట్లో కనీసం 50కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు దొరకటం ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ రేంజ్ లో సాగుతోందో స్పష్టం చేస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా ఆమ్యామ్యాలకు మరిగిన అధికారులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. యధేచ్ఛగా అవినీతిని కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ఏసీబీ కేసులు నమోదు చేస్తున్నా పట్టుబడిన వారికి శిక్షలు పడక పోతుండటమే. అక్రమాస్తులతోపాటు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దాదాపు 4 వందల కేసుల్లోని అధికారుల విచారణకు అనుమతి కోరుతూ పంపించిన ఫైళ్లు ఆయా శాఖల్లో ఏళ్ల తరబడిగా టేబుళ్లకే పరిమితమై ఉన్నాయి. ఈలోపు సస్పెండైన అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో తిరిగి పోస్టింగులు దక్కించుకోవటం మళ్లీ వసూళ్లను ప్రారంభించటం చేస్తున్నారు.
బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా లంచం…చేసిన పనికి బిల్లు చెల్లించమని అడిగినా లంచం…చివరకు పెన్షన్ ఫైల్ ను ముందుకు కదిలించండి మహాప్రభో అని మొర పెట్టుకున్నా లంచం..ఇలా ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వ కారణం…సమస్తం అవినీతిమయం అన్నట్టుగా ఉంది ఆయా డిపార్ట్ మెంట్ల పని తీరు తయారైన విషయం అందరికీ తెలిసిందే. ఏ చిన్న పని కోసం ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు దరఖాస్తు చేసుకున్నా అవినీతికి మరిగిన అధికారుల చేయి తడపనిదే పని జరటం లేదు. ఆమ్యామ్యాలకు చెక్ పెట్టటానికి చాలా సేవలను ఆన్ లైన్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రైవేట్ వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని మరీ అక్రమార్కులు నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. దీనికి సబ్ రిజిస్ట్రార్, ఆర్టీఏ, మీ సేవా కేంద్రాలు…ఇలా చెబుతూ పోతే అవినీతికి అడ్డాగా మారిన ప్రభుత్వ కార్యాలయాల జాబితా చాంతాడంత ఉంది.
Also read: Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలో చిత్రాల వినోదం.. కొత్త సినిమాల లిస్ట్ ఇదే..?
పని చేసి పెట్టటానికి లంచాలు తీసుకుంటున్న వారి సంగతి ఇలా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారి లీలలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్, ఎక్సయిజ్, ఆర్ అండ్ బీ..ఇలా చెబుతూ పోతే అన్ని ముఖ్యమైన శాఖల్లో ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉంటారని ఆయా డిపార్ట్ మెంట్లలో పని చేస్తున్న సిబ్బందే చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దన్న స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో ఏసీబీ అధికారులు గత ఏడాది నుంచి దూకుడు పెంచారు. ఒక్క 2025లోనే అత్యధికంగా 199 కేసులు నమోదు చేశారు. 273 మంది అధికారులను కటకటాల వెనక్కి పంపించారు.
Also read: బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్, అస్సలు మిస్సవ్వొద్దు
అదే సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కొట్లకు కోట్లు కూడబెట్టుకున్న అధికారుల బండారాన్ని బయట పెడుతున్నారు. సదరు అధికారులకు సంబంధించిన అక్రమాలపై మొదట సమగ్ర విచారణ జరిపి అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ తరువాత వేర్వేరు బృందాలుగా విడిపోయి సదరు అధికారుల నివాసాలతోపాటు వారి బంధువులు, బినామీల ఇండ్లపై దాడులు జరుపుతున్నారు. ఇటీవలిగా ఇలా దాదాపు ఏడుగురు అధికారుల ఆస్తులపై దాడులు చేయగా ఒక్కొక్కరి వద్ద కనీసం 50నుంచి 2వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ..కోట్ల రూపాయల్లో నగదు..కిలోల చొప్పు బంగారం, వెండి బయట పడ్డాయి. ఆస్తులు. బంగారు, వెండి నగలు, నగదును చూస్తే తమకే మతి పోతోందని ఏసీబీ అధికారులు వ్యాఖ్యానించటం గమనార్హం.
ఒకవైపు ఏసీబీ అధికారులు ఇంత చేస్తున్నా అవినీతికి మరిగిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మారటం లేదు. దీనికి ప్రధాన కారణం సంవత్సరాల తరబడిగా వారిని ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి కోరుతూ పంపించిన ఫైళ్లు పెండింగ్ లో ఉండిపోవటమే అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఇలాంటి ఫైళ్లు నాలుగు వందలకు పైగానే ఉన్నాయన్నారు. అవినీతికి మరిగి దొరికిన వారిని వీలైనంత తక్కువ సమయంలో ప్రాసిక్యూట్ చేసి ఆధారాలతో ఛార్జ్ షీట్లను కోర్టులకు సమర్పిస్తే వారికి శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అప్పుడే అక్రమార్కుల్లో భయం వస్తుందని చెప్పారు. అలా కాకుండా ప్రాసిక్యూషన్ అనుమతులకే ఏళ్లకు ఏళ్లు పడుతుండటంతో ఆమ్యామ్యాలకు మరిగిన వారు ఏమాత్రం భయపడటం లేదన్నారు. పైగా, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ సస్పెన్షన్లు ఎత్తి వేయించుకుని పోస్టింగులు కూడా తెచ్చుకుంటారని వివరించారు. ప్రాసిక్యూషన్ అనుమతులకు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితితో స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేసినపుడే పరిస్థితిలో మార్పు వస్తుందని చెబుతున్నారు.
Also read: Voter Revision: సర్ తో పరేషాన్.. అయోమయంలో హైదరాబాద్ ఓటర్లు.. దిక్కులు చూస్తున్న అధికారులు!