Voter Revision: స్వేచ్ఛ బ్యూరో: ఓటరు జాబితాలోని బోగస్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం హైదరాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై అటు ఓటర్లకు, ఇటూ ఎన్నికల విభాగం అధికారులకు సైతం అవగాహన లేకపోవటంతో అయోమయం, గందరగోళంగా కొనసాగుతుంది. గత నెల 25వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియ కోసం సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 4062 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లను, ఒక్కో నియోజకవర్గానికి ఒక ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ను నియమించినా, చాలా ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయి విధి నిర్వహణలో కన్పించటం లేదని ఓటర్లు వాపోతున్నారు.
మరి కొన్ని ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల ఫీల్డు వర్క్ ను తనిఖీ చేయాల్సిన ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు సైతం పర్యవేక్షణలో విఫలమవుతున్న కారణంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటిని సందర్శించే విధులు నిర్వహించటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సర్ ప్రక్రియ మొదలైన గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన ప్రతి ఇంటికి వెళ్లి, ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ సర్ మొదలైన నాటి నుంచే ఫారాల కొరత వెంటాడుతుంది. ఒక్కో ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు కొందరు ఒకటే ఫారం ఇచ్చి, దాన్ని జిరాక్స్ చేసుకోవాలని సూచించటం పట్ల ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పాతబస్తీలోని మైనార్టీలకు ఇంగ్లీష్ ఫారాలు అందలేదని వారు ఆందోళన చెందుతున్నారు. తెలుగు ఫారాలను అందించటం పట్ల శుక్రవారం చార్మినార్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఓటర్లు బూత్ లెవెల్ ఆఫీసర్లను నిలదీశారు. ఈ నెల 2వ తేదీ వరకు సిటీలోని మొత్తం 47 లక్షల 36 వేల పై చిలుకు ఓటర్లందరికీ ఫారాలను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత నెల 25 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఓటర్లందరికీ ఫారాలు పంపిణీ చేసి, అది ఎలా పూరించాలో వివరించి, శుక్రవారం నుంచి పూరించిన ఫారాలను తిరిగి ఓటర్ల నుంచి సేకరించాల్సి ఉంది. కానీ సిటీలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లకు ఫారాల పంపిణీ మొత్తం పూర్తి కాలేదు.
Also Read: నిన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. స్వామి వారి కానుకలు మాయం?
ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ కింద ప్రతి ఓటరు గతంలో 2002లో నిర్వహించిన ఇంటెన్సివ్ రివిజన్ లో తన ఓటు మూలాలను ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్ ఫారంలో తెలియజేయాల్సి ఉంది. కానీ చాలా మంది ఓటర్లు సర్ 2002లో తన ఓటు వివరాలు ఎక్కడ లభిస్తాయి? పార్లమెంట్ నియోజకవర్గం నెంబర్, అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ తో పాటు ఓటు ఉన్న భాగం, అందులో ఓటరు సీరియల్ నెంబర్ వంటివి సమాచారం ఫారంలో సమర్పించాల్సి ఉంది. దీనికి తోడు ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, దాన్ని ఫారంలో సరి చేసి కూడా ఇవ్వవచ్చు. దీనికి తోడు సమాచారంతో పాటు ఫొటో కూడా సరి చూసుకుని, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియపై ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ కూడా ఇచ్చామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి కూడా వెల్లడించినా క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ విషయాలన్ని ఓటరకు అర్థమయ్యేలా వివరించేందుకు తగిన సమయం ఇవ్వటం లేదని ఓటర్లు వాపోతున్నారు. 2002 సర్ లో లేని, ప్రస్తుతం జాబితాలో ఓటు వివరాలు కల్గిన ఓటర్లు 2002 సర్ లోని తమ తల్లిదండ్రులు, తాత, నానమ్న, అమ్మమ్మలతో పాటు బంధువుల ఓటు వివరాలను సమర్పిస్తే చాలని కూడా ఎన్నికల సంఘం చెప్పినా, ఈ విషయం సామాన్య ఓటర్లకు వివరించేలా బూత్ లెవెల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించటం లేదని ఓటర్లు మండిపడుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు అడుగుతున్న ప్రశ్నలకు బూత్ లెవల్ ఆఫీసర్లు పుస్తకాలు చూసి, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వారికిచ్చిన శిక్షణ ఏమైనట్టు? అసలు వారు శిక్షణకు హాజరయ్యారా? శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ ప్రక్రియలో తమ ఓటుకు సంబంధించిన సమాచారం తమ లోకల్ పొలిటికల్ లీడర్లు ఇస్తారని ఎక్కువ శాతం మంది ఓటర్లు ధీమాతో ఉన్నా, వివిధ పార్టీల నుంచి నియమితులైన సుమారు 10 వేల 901 మంది బూత్ లెవెల్ ఏజెంట్లలో చాలా మందికి కూడా సర్ ప్రక్రియపై అవగాహన లేదు. చాలా ప్రాంతాల్లో తామిచ్చిన ఫారం పూర్తి చేసి ఇస్తే చాలని ఓటర్లకు చెబుతున్నట్లు తెలిసింది.
Also rea: సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్.. అధికారులపై హైకోర్టు సీరియస్, నివేదికలు ఇవ్వలంటూ..
ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీలుగా వివిధ ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల నుంచి సుమారు 10 వేల 901 మంది ఏజెంట్లను నియమించినా, చాలా తక్కువ మంది ఏజెంట్లకు మాత్రమే సర్ పై పూర్తిగా అవగాహన ఉందని, మెజార్టీ సంఖ్య ఏజెంట్లకు సర్ అంటే ఏమిటీ? ఆ ప్రక్రియ ఎందుకు నిర్వహిస్తున్నారు? దానికి ఓటరు సమర్పించాల్సిన సమాచారం ఏమిటీ? అన్నది అసలు అవగాహన లేకపోవటం, బీఎల్ఓలు ఇంటింటిని సందర్శించకుండా బేఫీకర్ గా ఉండటం వంటి కారణాలతోనే క్షేత్ర స్థాయిలో సర్ ప్రక్రియ ఎన్నికల సంఘం ఆశించిన స్థాయిలో జరగటం లేదన్న వాదనలున్నాయి.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కు సంబంధించి ఎలక్షన్ వింగ్ లో ప్రస్తుతం ఉన్నతమైన హోదాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు కూడా అవగాహన అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. జిల్లా ఎన్నికల విభాగంలో కీలక విధులు నిర్వహించే ఓ ఉన్నతాధికారి ఇటీవ సర్ కు సంబంధించి కొందరు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించగా, సదరు ఉన్నతాధికారి ఎలక్షన్ కమిషన్ బుక్ లెట్ ను చూసి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందంటే రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల విభాగం బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ పొటికల్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ ఏ మాత్రం ఫలించిందో వారే అంచనా వేసుకోవచ్చు.
Also read: ‘నా కొడుకు నీ ఫ్యాన్.. వాడ్ని క్రిమినల్ అంటావా?’ పవన్‌పై సాయికృష్ణ తల్లి ఫైర్!