ACB Raids: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. పక్కాగా సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్ లో డివిజనల్ అడ్మినిస్ట్రేటీవ్ అధికారిగా పని చేస్తున్న తహసిల్దార్ దేసాని శ్రీనివాస్ రెడ్డి నివాసంతోపాటు అతని బంధుమిత్రుల ఇళ్లపై గురువారం దాడులు జరిపారు. తనిఖీలు జరిపి 6.88 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల పత్రాలు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం చూస్తే వీటి విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా.
హస్తినాపురం ప్రాంతంలోని సంతోషిమాతా కాలనీ నివాసి శ్రీనివాస్ రెడ్డి డివిజనల్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ రెడ్డి భారీగా అక్రమాస్తులను పోగేసుకున్నట్టుగా కొన్నిరోజుల క్రితం ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించారు. గురువారం వేర్వేరు బృందాలుగా విడిపోయి శ్రీనివాస్ రెడ్డి నివాసంతోపాటు అతని బంధుమిత్రులకు చెందిన మరో అయిదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు.
తనిఖీల్లో శ్రీనివాస్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల పేరన కర్మన్ ఘాట్ లో 2.63కోట్ల రూపాయల విలువ చేసే రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నట్టుగా వెల్లడైంది. దాంతోపాటు కర్మన్ ఘాట్ లోనే 1.61కోట్ల రూపాయల విలువ చేసే జీ ప్లస్ 3 భవనం ఉన్నట్టుగా తేలింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 25.50లక్షల విలువ చేసే 10 ఎకరాల గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ శివార్లలోని వేర్వేరు ప్రాంతాల్లో మరో 8 ప్లాట్లు ఉన్నట్టుగా తెలిసింది. ఇక, బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో శ్రీనివాస్ రెడ్డి 86లక్షలను పెట్టుబడులుగా పెట్టినట్టుగా వెల్లడైంది.
Also Read: కమిట్‌మెంట్ లేకుండా అవకాశాలు రావా..? ‘భాగ్య రేఖ’ఐశ్వర్య ఏం చెప్పిందంటే!
శ్రీనివాస్ రెడ్డి ఇంటి నుంచి ఏసీబీ అధికారులు 4లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి..అతని కుటుంబ సభ్యుల పేర ఉన్న బ్యాంక్ అకౌంట్లలో 8.60లక్షలు ఉన్నట్టుగా గుర్తించారు. 5.85లక్షల రూపాయల విలువ చేసే 680గ్రాముల బంగారు నగలను శ్రీనివాస్ రెడ్డి నివాసం నుంచి సీజ్ చేశారు. 59లక్షల విలువ చేసే మూడు కార్లు రెండు టూ వీలర్లు ఉన్నట్టుగా గుర్తించారు. 11లక్షల విలువ చేసే గృహోపకరణాలు ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇక, 46తులాల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి శ్రీనివాస్ రెడ్డి లోన్ తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా శ్రీనివాస్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు నమోదు కావటం ఇది రెండోసారి కావటం గమనార్హం. 2009లో అతను మహేశ్వరం మండలం తహసిల్దార్ ఆఫీస్ లో మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నపుడు ఇలాగే ఏసీబీ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా, వసూళ్లను మానుకోకుండా మరోసారి ఏసీబీ వలలో పడ్డాడు.
Also Read: 9 ఏళ్లుగా సిబ్బందికి బకాయిలు చెల్లించని వర్మ.. షూటింగ్ నిలిపేయడంతో దిగివచ్చిన ఆర్జీవీ!