Gajjala Kantham: గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అక్రమాలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.
యశోద, మెడికవర్ హాస్పిటళ్ల వ్యవహారం
హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి ఎకరం రూ. 11 కోట్ల చొప్పున 3 ఎకరాలకు డబ్బులు చెల్లించి, మరో 2 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కాంతం ఆరోపించారు. గజం ధర రూ. 1.50 లక్షలు ఉంటే, కేవలం రూ. 33 వేలకే కట్టబెట్టారని, 2015లో జారీ చేసిన జీవోల ద్వారా ఈ భూములను ధారాదత్తం చేసి కేటీఆర్ 15 శాతం వాటా పొందారని తెలిపారు. ఇక మెడికవర్ ఎండీ అనిల్ కృష్ణను బెదిరించి కేటీఆర్ పదేళ్ల కాలంలో రూ. 100 కోట్లు వసూలు చేశారని విమర్శించారు.
ఆస్తులు, వాటాలపై విమర్శలు
ఏపీలోని అమరావతిలో కేటీఆర్ తన భార్య శైలిమ పేరుతో రూ. 1000 కోట్లతో హోటల్ నిర్మించారని, కోహినూర్ హోటల్‌లో బెదిరించి 25 శాతం వాటా తీసుకున్నారని గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 కంటే ముందు కేటీఆర్ వద్ద రూపాయి కూడా లేదని, మరి అధికారంలోకి వచ్చాక ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై స్పష్టత
రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి అక్రమ ఆస్తులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. మాక్స్ బిన్ ఫార్మా కంపెనీ, స్వేచ్ బయో, షోడా కన్‌స్ట్రక్షన్, గీత హ్యుందాయ్ షోరూమ్‌లకు సీఎంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మైండ్ వాల్ట్ కార్పొరేట్ స్కూల్ సీఎం కూతురిది అంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఆ పేరుతో హైదరాబాద్‌లో స్కూలే లేదని మండిపడ్డారు. కేటీఆర్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో లేరని హెచ్చరించారు.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్ మార్పులు మీకోసమే!