Telangana Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ఓ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకపోయినా దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించిన వారిపై బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది.
అసలేం జరిగింది?
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెగ్యులరైజేషన్ ప్రక్రియలో భాగంగా అధికారుల బృందం లెక్చరర్ల విద్యార్హతలు, విద్యా సంబంధిత పత్రాలను సమగ్రంగా వెరిఫికేషన్ చేసింది. ఈ తనిఖీల్లోనే కొందరు అభ్యర్థులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు వెల్లడైంది.
షోకాజ్ నోటీసులు.. ఆపై వేటు!
వెరిఫికేషన్ సమయంలో నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఇంటర్ బోర్డు, గత నెలలో 36 మంది లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సరైన వివరణ ఇవ్వాలని, సర్టిఫికెట్ల ప్రామాణికత నిరూపించుకోవాలని గడువు ఇచ్చింది. అయితే వారిచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు విచారణలో అక్రమాలు నిజమేనని తేలడంతో బోర్డు 35 మందిపై వేటు వేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత కాపాడేందుకు, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందే వారిపై భవిష్యత్తులోనూ ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాయి.
Also Read: కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం