Khairatabad Bypoll: స్వేచ్ఛ బ్యూరో: ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపిక అంశం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ పేరు అభ్యర్థిత్వ రేసులో ముందుకు రావడంతో నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కొన్ని వర్గాలు ఆయన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతుండగా, ఇదే సమయంలో.. నియోజకవర్గంలో కొంతమంది స్థానిక నేతలు, టికెట్ ఆశిస్తున్న ఆశావహులు అసంతృప్తితో ఉన్నారన్న టాక్ బీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ‘ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానిక నాయకులను కాదని, మరో కుటుంబానికి చెందిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు?’ అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. టికెట్ ఇంకా అధికారికంగా ఖరారు కాకముందే ఈ స్థాయిలో చర్చ జరగడం బీఆర్‌ఎస్‌లోని అంతర్గత పోటీని బయటపెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టికెట్ సాయి కిరణ్‌కేనా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించాలన్న దానిపై కొంతకాలంగా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. సాయి కిరణ్‌తో పాటు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సీనియర్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.ఈ పోటీలో తలసాని కుటుంబం నుంచి సాయి కిరణ్ పేరు బలంగా ముందుకు రావడం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. పార్టీ అధిష్ఠానంతో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఉన్న సంబంధాలు, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనకు ఉన్న అనుభవం, నియోజకవర్గ పరిధిలోని రాజకీయ పరిచయాలు తమకు అనుకూలిస్తాయని ఆయన వర్గం భావిస్తున్నది.ఇటీవల ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆశావహుల్లో అసంతృప్తి
సాయి కిరణ్ పేరు తెరపైకి రావడంతో టికెట్ ఆశిస్తున్న కొందరు స్థానిక నేతల్లో అసంతృప్తి మొదలైందన్న ప్రచారం సాగుతోంది.‘నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నవారు లేరా? స్థానికంగా బలమైన నాయకత్వం ఉండగా బయట నుంచి అభ్యర్థిని ఎందుకు తీసుకురావాలి?’ అన్న ప్రశ్నను కొందరు నేతలు లేవనెత్తుతున్నట్లు సమాచారం. దానం నాగేందర్ పార్టీ మారినప్పటికీ నుంచి నియోజకవర్గ బాధ్యతలను మన్నెగోవర్దన్ రెడ్డికి అప్పగించారు. నాటి నుంచి ఆయన పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక్కసారిగాసాయికిరణ్ పేరు తెరమీదకు రావడంతో ఆయనతో పాటు పలువురు నేతలు సైతం డైలమాలో పడినట్లు సమాచారం. దీనికి తోడు స్తానిక నేతల్లోని అసంతృప్తి ఎటు దారి తీస్తుంది.. ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే కలిసి పనిచేస్తారా? అనేదానిపైనా చర్చజరుగుతుంది.
ఆర్ధికబలం విజయాన్ని నిర్ణయిస్తుందా?
సాయి కిరణ్‌కు టికెట్ ఇస్తే ఎన్నికల నిర్వహణ బాధ్యతలను తానే చూసుకుంటానని, అవసరమైన వనరులను సమకూర్చడంలో వెనుకాడబోమని మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ఇదే అంశం ఇప్పుడు నియోజకవర్గంలో మరో చర్చకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక బలం ఒక్కటే ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించదని, స్థానిక క్యాడర్, సంస్థాగత బలం, అభ్యర్థి వ్యక్తిగత పరిచయాలు కూడా కీలకమని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డివిజన్లలోనూ వ్యతిరేకత?
ఖైరతాబాద్ నియోజకవర్గంలో6 డివిజన్లు ఉండగా, ఇందులోని సగానికిపైగా డివిజన్లలో ఒక వర్గం సాయి కిరణ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ప్రత్యేకంగా స్థానిక రాజకీయాల్లో చాలాకాలంగా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు పట్టుబడుతుండటంతో పాటు పార్టీకి విజ్ఞప్తులు కూడా చేసినట్లు సమాచారం. తలసాని కుటుంబానికి టికెట్ ఇస్తే తమ రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందని కొందరు నేతలు సైతం ఆందోళన ఉన్నట్లు సమాచారం.
‘తలసాని పెత్తనం వద్దు’?
తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఆయన నిర్వహించిన సమావేశాలకు సైతం పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో నియోజకవర్గం ఖైరతాబాద్ కు విస్తరించాలనే ప్రయత్నం మొదలు పెట్టినప్పటి నుంచి పార్టీ కేడర్ లో చర్చకుదారితీసింది. ఆయన వస్తే నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తారని.. గతం నుంచి పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యం దక్కదనే ఆందోళన ఉన్నట్లు సమాచారం. టికెట్ అధికారికంగా ప్రకటించిన తర్వాతే అసలు అసంతృప్తి ఎంతవరకు ఉందో తేలే అవకాశం ఉంది.ఇది ఇలా ఉంటే తలసాని సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వ్యవహారశైలిపైనా కొంతమంది స్థానిక నేతల్లో అసంతృప్తి ఉందన్న చర్చ వినిపిస్తోంది. నాయకులతో సమన్వయం చేసుకోవాల్సిన చోట ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇది కూడా తలసానికి మైనస్ కానున్నట్లు సమాచారం.
సాయి కిరణ్‌పై కొత్త చర్చ
సాయి కిరణ్ యాదవ్‌కు రాజకీయంగా ఇది కొత్త ప్రయత్నం కాదు. ఆయన 2019లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన పేరు మరోసారి తెరపైకి రావడంతో గత అనుభవం ఈసారి ఎంతవరకు ఉపయోగపడుతుంది?’ అన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆపార్టీకే కలిసి వస్తుందని, రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ విజయం సాధించడంతో ఈ సారి ఆవే ఫలితాలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది. తలసానికి రెండో సారి కానుందా? అనే ప్రచారం జరుగుతుంది.
టికెట్ ప్రకటనకు ముందే మంటలు
ఖైరతాబాద్ ఉపఎన్నికకు బీఆర్‌ఎస్ అభ్యర్థి అధికారికంగా ఖరారు కాకముందే పార్టీలో టికెట్‌పై పోటీ, స్థానికత అంశం, నాయకుల మధ్య సమీకరణాలు చర్చకు వస్తున్నాయి.తలసాని సాయి కిరణ్‌కు టికెట్ దక్కితే స్థానిక ఆశావహులు ఎలా స్పందిస్తారు? వారిని ఏ మేరకు సమన్వయం పార్టీ చేస్తుంది? టికెట్ రేసులో ఉన్న ఇతర నేతలు చివరి వరకు పోరాడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడిఉంటుంది. ఏది ఏమైనా ఖైరతాబాద్‌లో అభ్యర్థి ఎంపిక కంటే.. పార్టీ నేతలను ఏకం చేయడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అసలు సవాలుగా మారే అవకాశముంది.
Also Read: మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!