Air India Bomb Threat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానం బాత్రూంలో ఓ అనుమానాస్పద వ్యక్తి రాసిన, బాంబు పేల్చి వేస్తా అన్న హెచ్చరికతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ విషయం పైలట్‌కు తెలియగానే, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కు సమాచారం అందించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఈ విమానాన్ని భద్రతా బలగాలు తక్షణమే తనిఖీ చేశాయి. ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు 4 గంటల పాటు విమానాన్ని పరిశీలించాయి. చివరికి ఇది నకిలీ బెదిరింపు అని తేలింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బెదిరింపు రాసినవారిని గుర్తించే దిశగా సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కావు. కొద్ది రోజుల క్రితమే ఇదే ఎయిర్ పోర్ట్ కు ఇలాంటి బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అలాగే బెంగళూరులోనూ ఇలాంటి కలకలం చోటుచేసుకుంది. ఓ స్కూల్‌కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఫలితంగా విద్యార్థులను ఖాళీ చేసి భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి. అది కూడా నకిలీ బెదిరింపుగా తేలింది.
Also Read: Hooch Tragedy: కల్తీ కల్లు ప్రభావం.. 15 మంది మృతి, ఎక్కడ?
ఈ తరహా తప్పుడు హెచ్చరికలు ప్రజల్లో భయం, అవాంతరాలు కలిగిస్తున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ, అలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఇక సాగనివ్వమని అధికారులు అంటున్నారు. నకిలీ బెదిరింపులపై కేసులు నమోదు చేసి, పాల్పడినవారిపై శిక్షలు అమలు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.