Love vs Honour: కంచె సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో హీరోను వేరే కులానికి చెందిన అమ్మాయి ప్రేమిస్తుంది. వారిద్దరి ప్రేమతో కులాల మధ్య ఉన్న కంచెను తొలగించాలని భావిస్తారు. అది రీల్ కాబట్టి చివరకు కంచె తెగుతుంది. రియల్ గా అది సాధ్యమా? అటువంటి కంచెలు నిజజీవితంలో ఏం సాధించాయంటే.. చివరికి భాదలు, కన్నీళ్లు, కడుపుకోతలు అందించాయని చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా కంచె లాంటి ప్రేమలు పుట్టుకొచ్చినా, ఆ కంచె తెగక ఎందరో ప్రేమికులు విగతజీవులయ్యారు. మరెందరో యువతీ యువకుల తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలతో జీవితం సాగిస్తున్నారు. ఇంతకు కంచె తెగేనా అనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి నేటి సమాజంలో ఉంది.
రెండు మనసులు కలిస్తే ప్రేమ.. ఇరు కుటుంబాలు కలిసి అవే మనసులను కలిపితే పెళ్లి. నేటి సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తే ప్రేమ – పెళ్లి మధ్య పెద్ద వైరమే సాగుతోందని చెప్పవచ్చు. ఆ వైరం హత్యలకు దారితీసిన పరిస్థితులు కోకొల్లలు. మరి ఇలాంటి దారుణాలకు అహంకారమే కారణమా? కులాలు, మతాలు కూడా ఒక కారణమా అంటే కొందరు ఔనని అంటారు. మరికొందరు కాదని అంటారు. ప్రేమ వర్సెస్ పెళ్లి మధ్య జరుగుతున్న పోరులో ఎన్నో జీవితాలు బుగ్గిపాలు కాగా, మరెన్నో కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిందని చెప్పవచ్చు. తాజాగా అమృత ప్రణయ్ ఘటనకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు అసలేం చెబుతోంది? ఆ తీర్పు సమాజంలో మార్పు తెస్తోందా? అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.
అమ్మ.. నాన్న.. ఇవి కేవలం రెండు పదాలు కాదు. ఆ స్థానంలో ఉన్న ఎవరైనా తమ బిడ్డలపై ఆప్యాయత, అనురాగాలు పంచి బిడ్డల కోసం పరితపిస్తారు. నేటి సమాజంలో అమ్మ, నాన్న అనే పదాలకు కళంకం తెచ్చే ఘటనలు కూడా అక్కడక్కడా జరిగాయి. వాటిని అలా పక్కన పెడితే, తమ సంతానంకు తమ కష్టం రాకూడదని భావిస్తారు తల్లిదండ్రులు. కొండ మీద ఉన్న కోతిని తెచ్చి ఇవ్వమని అడిగినా, అలా తెచ్చి ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. అంతేకాదు కాయకష్టం చేసి ఇంటికి వచ్చి తమ పిల్లలను చూసి, ఆ కష్టాన్ని మరచిపోయే వారు కూడా ఉన్నారు.
బిడ్డలపై ప్రేమ కురిపించడంలో తమకు ఎవరూ లేరు సాటి అనే స్థాయిలో వారు చూపే ప్రేమ చూసి, ఆ ప్రేమకే అసూయ పుట్టించే వారు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులు దేనికైనా సై అనేస్తారు. ఆ ఒక్క విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. కొందరు అదే విషయంలో ప్రోత్సహించి తమ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటే, మరికొందరు ముందు మాటలు, తర్వాత వార్నింగ్ లు, ఆ తర్వాత హత్యల వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇంతకు ఆ ఒక్క విషయం ఏమిటని అనుకుంటున్నారా.. అదేనండీ ప్రేమ.
నేటి సమాజంలో ప్రేమ అనే పదం వయస్సుతో సంబంధం లేకుండా పలికే పదంగా మారింది. ప్రేమ అనే ఊహలో ఉంటే చాలు, ఆ సమయంలో కులం, మతం, డబ్బు ఇవేవి అడ్డురావు. ప్రేమ అనే బంధానికి బానిసలు కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సమాజంలో పిల్లల కళ్లెదుట జరిగే దృశ్యాలు కావచ్చు. అలాగే వారు ఉంటున్న వాతావరణం కావచ్చు. మరికాస్త ముందుకు వెళితే వారి స్నేహం కూడా కావచ్చు. అంతేకాదు ఆ ప్రేమను ఇంట్లో ఉన్నవారు పంచలేని పరిస్థితులు కావచ్చు. అయితే కొన్ని ఘటనలు చూస్తే ప్రేమ మాటున శారీరక ప్రేమలు ఉంటాయి. వాటి గురించి అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజమైన ప్రేమలకు ఓ కంచె అడ్డుపడుతోంది. కనిపెంచిన తల్లిదండ్రులకు, బిడ్డలకు ఆ కంచె విడదీస్తోందని చెప్పవచ్చు.
బాల్యం నుండి బుడిబుడి అడుగులు వేయించిన తల్లిదండ్రులు గొప్పనా? మధ్యలో వచ్చిన ప్రేమ గొప్పనా అంటే కొందరు రెండూ గొప్పే అంటారు. మరికొందరు దేని గొప్పతనం అదే అంటారు. ఈ రెండు బంధాల మధ్య సాగుతున్న సమరంకు ఆజ్యం పోసేదే కులం, మతం. ఈ రెండు ఎందరికో కడుపుకోత, ప్రేమ అనే బంధానికి దూరం చేశాయని చెప్పవచ్చు. తాజాగా అమృత ప్రణయ్ ఘటనను తీసుకుంటే.. ఒకరు నిజమైన ప్రేమకు బానిసలు.. మరొకరు తండ్రిగా తన భాద్యతకు బానిసలు.
ఇక్కడ ఎవరికి వారు యమునా తీరే అనే రీతిలో జీవనం సాగించే పయనంలో, క్రూరంగా ఆలోచించి హత్య వరకు వెళ్లారు. చివరికి రెండు కుటుంబాలకు ఈ ఉదంతంలో విషాదమే మిగిలింది. రెండు కుటుంబాలలో కామన్ పాయింట్ ఏమిటంటే.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడమే. ఇటు ప్రణయ్ ను కోల్పోయి అమృత ఒంటరిగా మారింది. అమృత తల్లి తన భర్తను కోల్పోయి ఆమె ఒంటరిగా మారింది. అయితే అమృత లోని ధైర్యం ఆమెను నడిపిస్తుందని చెప్పవచ్చు.
ఇక్కడ కీలకంగా మారింది మాత్రం కులం. ఆ కులం అనే పట్టింపు విషాదాన్ని అందించింది కానీ ఎవరికీ ఆనందాన్ని పంచలేదు. నేటి ఆధునిక కాలంలో ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకొని జత కలుపుతున్నారు. మరికొందరు సమాజానికి భయపడో ఏమో కానీ కులం అనే ముసుగులో కన్నప్రేమను మరచి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. ఓ పక్షి తన సంతానాన్ని రెక్కలు వచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకుంటుంది. రెక్కలు రాగానే తన పిల్లలను స్వేచ్చగా విహరింపజేస్తుంది. కానీ నేటి సమాజంలో ప్రేమ అనే బంధం ఎక్కడ తమ పిల్లలకు అనుబంధంగా మారుతుందోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు రూల్స్ పాటిస్తున్నారు. ఆ రూల్స్ మరొకరి ప్రేమకు దగ్గరికి చేస్తాయన్న విషయాన్ని మరచిపోతున్నారు.
Also Read: Pranay Murder Case Verdict: చంపి ఏం సాధించారు? ప్రణయ్ తల్లిదండ్రులు భావోద్వేగం
తమ పిల్లల కోసమే తమ తాపత్రయం అనే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, ప్రేమ అనే మాటెత్తగానే పిల్లలపై వారికున్న ప్రేమ ద్వేషంగా మారుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కనిపెంచిన తల్లిదండ్రుల మాటకు పిల్లలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంత ఉందో, పిల్లల మాటలను పరిగణలోకి తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాల్సిన భాద్యత తల్లిదండ్రులపై ఉంది. ప్రేమ పెళ్ళిళ్లు నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ పొందలేదు. అలాగే పెద్దలు కుదిర్చిన కొన్ని పెళ్లిళ్లు కూడా ఆ స్థాయిలో లేవని చెప్పవచ్చు.
ప్రేమ, పెళ్లి రెండు వేర్వేరు అయినప్పటికీ ఇక్కడ మనసులు కలవడం ముఖ్యం. మనసులు కలిస్తే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు నిలుస్తుందని మేధావులు తెలుపుతుంటారు. ప్రేమ అనే బంధానికి కులం, మతం అడ్డంటూ కంచె వేసిన తల్లిదండ్రులు, కాస్త ఆలోచించాలని యువత కోరుకుంటున్నారు. అదే రీతిలో తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే భాద్యత పిల్లలపై ఉందని, తమ ప్రేమను విజయతీరాల వైపు మళ్లించేలా తమ వారిని ఒప్పించుకొనే సత్తా కూడా ప్రేమికుల్లో ఉండాలని మేధావులు సూచిస్తున్నారు.
Also Read: NRI Woman case updates: ఎన్నారై మహిళ కేసు న్యూ ట్విస్ట్.. డాక్టర్ శ్రీధర్ అరెస్ట్
మొత్తం మీద అమృతప్రణయ్ ఘటనను పరిగణలోకి తీసుకుంటే కులం అనే కంచె ఆ రెండు కుటుంబాలను అల్లకల్లోలం చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం నాటి రోజులను ఆ రెండు కుటుంబాలు కోట్లు ఖర్చు పెట్టినా పొందలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మరే కుటుంబానికి రాకుండా ఇటు తల్లిదండ్రుల్లో, అటు యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.