Mehdipatnam Skywalk: హైదరాబాద్ లో అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెహదీపట్నం ఒక్కటి. అయితే అక్కడ జంక్షన్ వద్ద సరికొత్తగా ఐకానిక్ స్కైవాక్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి స్కైవాక్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు.. వీలైనంత త్వరలోనే స్కైవాక్ ను ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్, రైతు బజార్ మధ్య అలాగే గుడిమల్కాపూర్ ట్రాఫిక్ జంక్షన్ నుండి మెహదీపట్నం బస్ బే వరకు ఇప్పటికే.. స్కైవాక్‌ల తయారీ పూర్తయింది. ప్రస్తుతం లిఫ్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మెహదీపట్నం రైతు బజార్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వైపు బస్ బే (డిఫెన్స్ ఏరియా)ను కలిపే ఫుట్-ఓవర్-బ్రిడ్జి వరకు పనులు జరుగుతున్నాయి. మెహదీపట్నంలోని 2,500 చదరపు గజాల స్థలంలో స్కైవాక్ నిర్మించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2024 జనవరిలో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం, ప్రతిపాదిత స్కైవాక్ మార్చి 2023లో పూర్తి కావాల్సి ఉంది, కానీ అది ఆలస్యమైంది.
390 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ స్కైవాక్‌లో రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్ (మిలిటరీ గారిసన్), బస్ బే ఏరియా (మెహదీపట్నం), హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుడిమల్కాపూర్ జంక్షన్ వద్ద ఐదు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ నిత్యం ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కైవాక్ ప్రాజెక్ట్ ఖర్చు రూ. 38 కోట్లు అవుతోందని.. ఆగస్టు నాటికి పూర్తి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించినట్టు తెలిపారు.
Also Read: DRDO Recruitment: డీఆర్‌డీవోలో 148 ఉద్యోగాలు.. శాలరీ రూ.56,100.. దరఖాస్తుకు లాస్ట్ డేట్?
ఈ స్కైవాక్ లో 21,061 చదరపు అడుగుల వాణిజ్య స్థలం కూడా ఉందని అధికారులు తెలిపారు. ప్రతిపాదిత స్కైవాక్ లో కాఫీ షాపులు, గేట్ వే కార్నర్లు, లాంజ్ స్నాక్స్ నిర్మించాలని ప్రణాళిక వేశారు. స్కైవాక్ లో 13 లిఫ్టులు, రెండు ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్ లు, స్ట్రెచ్ లు ఉన్నాయి. మెహదీపట్నం జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజలను క్షేమం కోసం నిర్మిస్తున్నారు.
ఈ స్కైవాక్ గాజు, ఉక్కుతో నిర్మిస్తున్నారు. ఇది భూమి నుండి 6.15 మీటర్ల ఎత్తులో ఆరు యాక్సెస్ పాయింట్లతో సహా అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉందని అధికారులు తెలిపారు. 380 మీటర్ల వంతెనకు సస్పెన్షన్ తీగలు సపోర్టుగా ఉంటాయి. 450 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో మొత్తం 13 లిఫ్టులు ఉన్నాయి. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకమైన లిఫ్ట్ చైర్ ఏర్పాటు చేశారు. స్కైవాక్ ప్రాంతం చుట్టూర ఆర్చ్, కేబుల్స్, వాక్‌వే సొరంగాల వెంట LED స్ట్రిప్ లైట్లు నిర్మించనున్నారు. HMDA ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి కృష్ణ మాట్లాడుతూ.. జూలై చివరి నాటికి స్కైవాక్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు.. వీలైనంత త్వరలోనే స్కైవాక్ ను ఓపెన్ చేస్తామని అన్నారు. నగరంలో మొట్టమొదటి ఉప్పల్ స్కైవాక్ తర్వాత మెహదీపట్నం స్కైవాక్ అత్యద్భుతంగా నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Also Read: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.55,000 జీతం, ఈ అర్హత ఉంటే ఎనఫ్