Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌజ్ భూముల సందర్శనకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్లడమేంటని ప్రశ్నించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మీకెవడిచ్చాడు ఆ అధికారం?
ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫాంహౌజ్ లో ఒకవేళ సర్కార్ భూములుంటే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, ఆ విషయాన్ని వదిలేసి ఈ రాజకీయ డ్రామాలేంటని మండి పడ్డారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే డాక్యుమెంట్స్ తో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ పార్టీ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని ఉద్ఘాటించారు. 22ఏ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు 22ఏ ను తమకు అనుకూలంగా వాడుకున్నారని ఫైరయ్యారు.
రూ. 17 కోట్లతో బయోమైనింగ్ పనులు..
22ఏ సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని, అవసరమైతే న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నామని, కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నామని, కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నామన్నారు. రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్లు మొదలు కాబోతున్నాయన్నారు. మరో రూ.80 యూసీఎఫ్ నిధులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులు చేపట్టబోతున్నామని బండి తెలిపారు. మరో 16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.
ఉప ఎన్నికల భయం!
కరీంనగర్ లో గణేశ్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించబోతున్నామని బండి సంజయ్ తెలిపారు. గతంకంటే ఎక్కువ బడ్జెట్ ను ఈసారి కేటాయించామన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తితో నిష్టగా ఎవరు చేసినా సక్సెస్ అవుతారన్నారు. ప్రతి ఒక్కరూ భక్తియుత, ధార్మిక వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. పోలీసులకు పూర్తిగా సహకరించాలని బండి కోరారు. ఇదిలాఉండగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ..
ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని, కాంగ్రెస్ ను జనం అసహ్యించుకుంటున్నారని బండి విమర్శించారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదన్నారు. దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవాచేశారు. వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని దానం నాగేందర్ గుర్తుంచుకుని జాగ్రత్త పడితే బెటరని సూచించారు. దానం నాగేందర్ నిండు నూరేళ్ల జీవించాలని కోరుకుంటున్నానని, ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని బండి ధీమా వ్యక్తంచేశారు.
Also Read: రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!