Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: ఓటు, సీటు చోరీ పేటెంట్స్ కాంగ్రెస్ వేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. మొట్టమొదటి ఓటు, సీటు చోరీకి తెరలేపింది కాంగ్రెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటీష్ పాలకులు కాంగ్రెస్ కోరిన సమయంలో దేశంలోని ప్రదేశ కాంగ్రెస్ కమిటీలన్నీ తొలి ప్రధాని అభ్యర్థిగా పటేల్ పేరు ప్రతిపాదిస్తూ ఓట్లేస్తే.. ఒక్క పీసీసీ మద్దతు కూడా లేని నెహ్రూను ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ దేనని ఎద్దేవా చేశారు.
బండి సంజయ్ మాట్లాడుతూ..
మోడీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుంచి హౌజింగ్ బోర్డు కాలనీ పడవ చౌరస్తా వరకు బుధవారం సేవా జ్యోతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి కాంగ్రెస్ లా.. ఓటు, సీటు చోరీకి పాల్పడాల్సిన కర్మ లేనేలేదన్నారు. ఆయనకు కుటంబమే లేదని, బ్యాంకు బ్యాలెన్స్, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాలు అవసరమే లేదన్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని, ఈసీ బీజేపీ జేబు సంస్థ కానేకాదన్నారు. జ్ఞానేశ్ కుమార్ అంశం కోర్టులో తేల్చుకోవాలని, రాజ్యాంగ సంస్థపై దాడి దుర్మార్గమని బండి ఫైరయ్యారు.
ఈసీ అపాయింట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు..
రాహుల్ గాంధీ ఈసీని ఎప్పుడైనా కలవచ్చని, ఈసీ అపాయింట్ మెంట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వందల మందితో దాడికి వెళ్తే అడ్డుకోక ఏం చేస్తారని నిలదీశారు. కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని బండి పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలనే సోయి కాంగ్రెస్ కు లేనేలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై పోరాడే దమ్ము బీఆర్ఎస్ కు లేదన్నారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలున్నాయని బండి ధ్వజమెత్తారు. తనకు బీజేపీ ఎన్నో పదవులిచ్చిందని, తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని బండి పేర్కొన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శిరసావహిస్తానని, కార్యకర్తగా పార్టీ కోసం చేస్తానని బండి వెల్లడించారు.
Also Read: టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలతో కుట్రలు చేస్తున్నారు!