Bandi Sanjay : ఉత్కంఠ వీడింది. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరైంది. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గురువారం హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మేజిస్ట్రేట్ రాపోలు అనిత సుదీర్ఘ విచారణ చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. రూ.20 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.
బండి సంజయ్ కు పలు షరతులు విధించారు. దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించారు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని నిర్దేశించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని కోరారు. బెయిల్ మంజూరవడంతో సంజయ్ శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
మరోవైపు నిందితులు బండి సంజయ్, బూర ప్రశాంత్, మహేశ్‌లను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కమలాపూర్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు కొనసాగాయి. నిందితులకు కస్టడీ పిటిషన్ సమాచారం ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మేజిస్ట్రేట్ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. బండి సంజయ్ బుధవారమే దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు బెంచ్‌పైకి వచ్చింది.
రాత్రి 10 గంటల వరకు నిర్ణయం వెలువడకపోవడం, పోలీసులు కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసిన పరిణామాలను బట్టి గురువారం బెయిల్ రాదనే అంతా భావించారు. దాదాపు 8 గంటల వాదోపవాదాల తర్వాత మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కోర్టు ఆదేశాలతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించడంతో బండి సంజయ్‌ను విడుదల చేయాలని కరీంనగర్ జైలు పర్యవేక్షకుడికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.