Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: “హుజురాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే ఇక్కడ మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణం సూపర్ బజార్ చౌరస్తాలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాల మీదుగా సాగిన ఆయన పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. సభ ప్రారంభంలో “వస్తున్నాడే అన్న వస్తున్నాడే.. పేదోళ్ల పెన్నిధి వస్తున్నాడే” అన్న నినాదాలతో పట్టణం కాషాయమయమైంది.
సభను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ, గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు హుజురాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ధ్వజమెత్తారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన తులం బంగారం, రూ. 4000 పెన్షన్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం వంటి గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఖజానా ఖాళీ అని సాకులు చెబుతూ ప్రజలను మోసం చేస్తోంది” అని మండిపడ్డారు.
బిఆర్ఎస్ హయాంలో ప్రజలపై పన్నుల భారం బీఆర్ఎస్ సమయంలో ప్రజలపై పన్నుల భారం పెరిగిందే తప్ప సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు.
Also Read: Anthropic AI: ఐటీపై ఏఐ పిడుగు.. ఆంథ్రోపిక్ దెబ్బ.. షేర్స్ ఢమాల్
కేంద్ర నిధుల వినియోగం – భవిష్యత్ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయతీల కోసం మొదటి విడతగా రూ. 259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్ ఎన్నికల అనంతరం హుజురాబాద్ కోసం ప్రత్యేకంగా మరో రూ. 500 కోట్లు తీసుకువస్తానని సంజయ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో బల్లగుద్ది నిధులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను ఎంపీగా మున్సిపాలిటీకి రూ. 19.57 కోట్ల ఆర్థిక సంఘం నిధులు, అమృత్ పథకం కింద రూ. 16 కోట్లు, స్వచ్ఛ భారత్ నిధులు రూ. 1.20 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.
ఆసుపత్రిలో ఆధునిక ఎక్స్రే, స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేయడం, 20 వేల మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ వంటి పనులను ప్రస్తావిస్తూ, బిజెపికి అవకాశం ఇస్తే రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు మరియు అగిపోయిన మినీ స్టేడియం పనులను పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు.
జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, మోదీ నాయకత్వంలోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సభ ముగింపులో పోటీ చేస్తున్న అభ్యర్థులందరితో బండి సంజయ్ ప్రతిజ్ఞ చేయించారు. “గెలిచిన తర్వాత ఏ కారణం చేతనైనా పార్టీ మారబోమని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, దేశం, సమాజం, ధర్మం కోసం నిబద్ధతతో ఉంటామని” అభ్యర్థులు తమ తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.
Also Read: Yadadri Forest Alert: యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచారం..!