Anil Kumar Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వడ్ల కొనుగోలు అంశంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. భువనగిరి ప్రాంతం హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో బీజేపీ నాయకులు పదేపదే ఇక్కడికి వస్తూ.. రైతులను అయోమయానికి గురిచేయడం తప్ప సాధించిందేమీ లేదని మండిపడ్డారు.
ధాన్యానికి మద్దతు ధర (MSP) కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు జరుపుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత రెండు పంటల నుండి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో పండుతున్న ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి కొనుగోళ్లు జరగడం లేదని అనిల్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘వరి వేస్తే ఉరి’ అని రైతులను భయపెడితే, తమ ప్రభుత్వం మాత్రం పూర్తి చిత్తశుద్ధితో ధాన్యాన్ని సేకరిస్తోందన్నారు. స్వల్పంగా స్టోరేజ్ సమస్యలు ఉన్నప్పటికీ మిల్లర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని చెప్పారు. గతంలో నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది, ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లి ఇక్కడి వాస్తవాలను వివరించాలే తప్ప, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Also Read: గవర్నర్ ను కలిసిన కవిత.. వినతి పత్రం అందజేత.. సీఎంపై ఘాటు విమర్శలు