Hyderabad Formula E Race: ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగలింది. హైకోర్టు ఆదేశాలతో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చేప్పేసింది. దీంతో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే.. ఇవాళ విచారణ సందర్భంగా సెక్షన్ 13(1)పై వాదనలు వినిపించారు. అవినితీ నిరోదక చట్టం సెక్షన్ 13(1) వర్తించదంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రూ.54 కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదని అన్నారు. డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతోందని.. చేయాలనుకుంటే కేటీఆర్‌ను అరెస్ట్ చేసుకోండి అంటూ న్యాయవాది మాట్లాడారు. అయితే రేపు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కానున్నారు.
ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషిన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read: GRSEL Recruitment: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేదు.. భారీ శాలరీ.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!
సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిందన్న వార్తలను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇంచార్జీ సోమ భరత్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై కొన్ని మీడియా ఛానెల్స్ వక్రీకరించడం దురదృష్టకరమని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ-రేస్‌ను హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో నిర్వహించామని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ సహకరిస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిపారు. కొన్ని మీడియా ఛానెల్స్ కావాలనే క్వాష్ పిటిషన్ విత్ డ్రాను వక్రీకరించాయని సోమ భరత్ కుమార్ తెలిపారు.
మరోవైపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంతో.. రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే కేటీఆర్‌తో పాటు అడ్వొకేట్ హాజరవుతానని కేటీఆర్ తనకు సమాచారం ఇవ్వలేదని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.