BJP Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సరికొత్త వ్యూహాలతో కసరత్తు షురూ చేసింది. రాష్ట్రంలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను(రాష్ట్ర కార్యవర్గ సమావేశం) గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా క్యాడర్‌లో కొత్త జోష్ నింపాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం కీలక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలకు అధిష్టానం నిర్దిష్ట బాధ్యతలను అప్పగించింది. కేవలం సమావేశాల నిర్వహణకే పరిమితం కాకుండా, ప్రతి ప్రోగ్రామ్ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచించారు. సమన్వయ లోపం లేకుండా ఉండేందుకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్‌లుగా నియమించారు.
రాష్ట్ర కార్యవర్గా సమావేశాల్లో భాగంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా మూడు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఆయన ఇక్కడే ఉంటూ వరస సమీక్షలు నిర్వహించడమే కాకుండా, పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్తు కార్యాచరణపై రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఈ పర్యటనలో నితిన్‌తో పాటు బీజేపీ అగ్ర వ్యూహకర్త, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా తెలంగాణకు వస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలం తర్వాత బన్సల్ తెలంగాణ అడుగుపెడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించి, అక్కడ పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచించిన బన్సల్.. ఇప్పుడు తెలంగాణకు వస్తుండటంతో బీజేపీ తదుపరి ప్రధాన టార్గెట్ తెలంగాణే అనే చర్చ బలంగా సాగుతోంది.
Also read: Crop Diversification: తెలంగాణ రైతులకు అలర్ట్.. వరి సాగుకు బ్రేక్.. ప్రభుత్వం సరికొత్త వ్యూహం!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈమధ్య కాలంలో ఆయన తెలంగాణకు వచ్చిన దాఖలాల్లేవు. దేశవ్యాప్తంగా జరిగిన పలు కీలక ఎన్నికల్లో బన్సల్ తన మార్క్‌ను చూపించారు. పశ్చిమ బెంగాల్ లోనూ తనదైన మార్క్ గెలుపును రచించుకున్నారు. అంత చరిష్మా ఉన్న బన్సల్ గత తెలంగాణ తసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో వెనుకపడ్డారనే చర్చ గతంలోనే జరిగింది. తాజాగా బెంగాల్ గెలుపు జోష్ తో ఉన్న కాషాయ పార్టీ.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ పాగా వేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే బన్సల్ ను హైకమాండ్ మళ్లీ తెలంగాణకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. బన్సల్ మార్క్ వ్యూహాలు, నితిన్ సుదీర్ఘ పర్యటనతో తెలంగాణలో కమల దళం మరింత దూకుడు పెంచడం ఖాయమని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ద్వారా రాష్ట్రంలో పొలిటికల్ మైలేజ్ సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.
ఇదిలాఉండగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అధ్యక్షతన సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గం సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నేతలు చర్చించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఏర్పాట్లు, కార్యాచరణ, ఇతర అంశాలపై లక్ష్మణ్ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ చీఫ్ టూర్ విజయవంతంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను సక్సెస్ అయ్యేలా చూడాలని సూచించినట్లు తెలిసింది.
Also read: హైడ్రోజన్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో పట్టాలపై పరుగులు!