Bollaram Arms Theft: సికింద్రాబాద్ బొల్లారంలో కలకలం రేపిన ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను మల్కాజిగిరి కమిషనర్ సుమతి మీడియాకు వెల్లడించారు. బెల్లా ఫామ్ నిబంధనలను ఉల్లంఘించి ఆయుధాలను దొంగిలించినట్లు గుర్తించామని.. మల్కాజిగిరి, SOT, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ బృందాల సంయుక్త దర్యాప్తుతో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. ఈ నెల 11న ప్రధాన నిందితుడు మల్లేష్‌ను అదుపులోకి తీసుకుని, గన్నీ బ్యాగుల్లో దాచిన గన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పది రోజుల పాటు అతడిని కస్టడీకి తీసుకుని విచారించామని పేర్కొన్నారు.
ఆర్మీ నేపథ్యం నుంచి నేరాల బాట వైపు..
గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన మల్లేష్, 2025 వరకు మేఘాలయ, జమ్మూ, ఊటీల్లో విధులు నిర్వహించి అనంతరం మద్రాస్‌కు బదిలీ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రావడం, ఫ్లాట్ కొనుగోలుతో పాటు ఇల్లు కడుతుండటంతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మల్లేష్‌పై గతంలో అచ్చంపేటలో రెండు చోరీ కేసులు ఉన్నాయి.
పక్కా ప్రణాళికతోనే చోరీ
మాజీ ఆర్మీ పరిచయాలతో నిందితుడు శేషు, కోట్ ఇంచార్జ్ వినోద్, ప్రవీణ్‌లతో మల్లేష్ సంబంధాలు పెంచుకున్నాడు. డబ్బు ఆశ చూపి వారిని తన పథకంలో భాగస్వాములను చేశాడు. వినోద్ సీసీ కెమెరాలు, సెంట్రీ డ్యూటీల సమాచారాన్ని అందించగా, మల్లేష్ స్కూటీపై వచ్చి ఐరన్ రాడ్‌తో తాళాలు పగలగొట్టి ఆయుధాలను దొంగిలించాడు. చోరీ పూర్తయ్యాక ‘కామ్ హోగయా’ అని ప్రవీణ్‌కు మెసేజ్ పంపి, వాట్సాప్, ఫోన్ కాల్ హిస్టరీని డిలీట్ చేశాడు. నిందితులు జూలై 14 నుంచి ఆగస్టు 27 వరకు ఒకే లొకేషన్ లో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు.
ఆధారాలు.. తదుపరి విచారణ
ఆర్మీ నుంచి ఆయుధాలు తెస్తాడని నిందితుడు బీర్బల్ షాకు ముందే తెలుసని, అలాగే మల్లికార్జున్, నిరంజన్‌లతో కలిసి బ్యాంకు దోపిడీలకు కూడా వీరు స్కెచ్ వేశారని సీపీ చెప్పారు. ఘటనా స్థలంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం నిందితులకు కలసివచ్చింది. అయితే వినోద్ ఒక పిస్టల్ పోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చి కేసు త్వరితగతిన తేలింది. ఈ చోరీ వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని సీపీ స్పష్టం చేశారు.
Also Read:నాలా అనుమతి లేదా? అయినా మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి!