Fish Powder Plan: స్వేచ్ఛ బ్యూరో: చిన్నారులకు మరింత పోషకాహారం అందించేందుకు తెలంగాణ మత్స్యశాఖ కొత్త ఆలోచన చేస్తోంది. స్థానికంగా లభించే చిన్న స్వదేశీ చేపలతో ‘ఫిష్ పౌడర్’ తయారు చేసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చేపల్లో సహజంగా లభించే పోషకాలు, ముఖ్యంగా ప్రొటీన్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలతోపాటు విటమిన్-బి12, విటమిన్-డి వంటి పోషకాలు అందేలా ఉత్పత్తిని రూపొందించాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. అదనంగా కొన్ని హెర్బల్ లీవ్స్‌ను మిశ్రమంగా చేర్చే అంశంపైనా పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం.
చిన్న చేప.. పెద్ద పోషణ
చిన్న స్వదేశీ చేపలు(పరకలు, ఊసబొడుపు, చందమామ తదితర) పరిశుభ్రంగా ఎండబెట్టి, పొడిగా మార్చి ఆహారంలో కలిపే విధానం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలైంది. చిన్న చేపల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్, కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయి. బాలితలు సైతం ఈ పౌడర్ ను తీసుకొంటే బిడ్డకు సరిపడ పాలను సైతం అందించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.చేపలను సంపూర్ణంగా, తగిన శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తే వాటి పోషక విలువను చిన్న పరిమాణంలోనే ఆహారంలో చేర్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలోనూ స్థానికంగా లభించే చిన్న చేపలను గుర్తించి వాటితో ఫిష్ పౌడర్ తయారీకి అనువైన విధానాన్ని రూపొందించాలన్నది ప్రతిపాదన. పిల్లలు తినే సాధారణ ఆహారంలో సులభంగా కలిపేలా పొడి రూపంలో అందించాలన్న ఆలోచన ఉన్నట్లు తెసమాచారం. వరల్డ్ ఫిష్ ఆధ్వర్యంలో అస్సాంలో అమలు చేసిన ‘మత్స్య పరిఫుష్టి’ కార్యక్రమంలో స్థానిక చిన్న చేపలతో తయారు చేసిన పొడిని అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల ఆహారంలో కలిపి అందించారు. ఒరిస్సాతో పాటు అస్సాంలో ‘మోలా’ వంటి చిన్న చేపలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చేపల్లో విటమిన్-బి12, ఐరన్, కాల్షియం తదితర పోషకాలు గణనీయంగా ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి.
బి12.. డి కూడా
ప్రతిపాదిత ఫిష్ పౌడర్‌లో విటమిన్-బి12, విటమిన్-డి సహా సూక్ష్మ పోషకాలు అందేలా ఫార్ములేషన్ రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. చిన్నారుల శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఆహారం ద్వారా అందేలా చేయడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం.అయితే తుది ఉత్పత్తిలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉంటాయన్నది ఎంపిక చేసే చేప జాతి, తయారీ విధానం, ఇతర పదార్థాల మిశ్రమంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఫిష్ పౌడర్ తుది ఫార్ములాను ఖరారు చేసే ముందు పోషక విలువలు, నాణ్యత, సూక్ష్మజీవ భద్రత, నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
హెర్బల్ లీవ్స్ మిశ్రమం
చేపల పొడిలో అదనంగా హెర్బల్ లీవ్స్ లేదా పోషక విలువలున్న ఆకుకూరల(ముఖ్యంగా పూదీన, కరివేపాకు, పెప్పర్, కోత్తిమీర, తులసీ, అల్లం, పసుపు, వెల్లుల్లి) పదార్థాలను కలపాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే పిల్లల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తి కావడంతో ఏ ఆకులను ఉపయోగించాలి, వాటి మోతాదు ఎంత ఉండాలి, చేపల పొడితో కలిపినప్పుడు పోషక విలువ ఎలా మారుతుంది, రుచి–ఆమోదయోగ్యత ఎలా ఉంటుంది వంటి అంశాలపై శాస్త్రీయ పరీక్షలు కీలకం కానున్నాయి.
అస్సాం.. ఒడిశా బాటలో
చిన్న చేపల పొడిని ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాల్లో వినియోగించడం దేశంలో కొత్త ప్రయోగం కాదు. అస్సాంలో ‘మత్స్య పరిఫుష్టి’ కార్యక్రమం కింద చిన్న చేపల పొడిని అంగన్‌వాడీ పిల్లల ఆహారంలో చేర్చే పైలట్ నిర్వహించారు. పిల్లల పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, ఆహార వైవిధ్యాన్ని పెంచడమే లక్ష్యం. అస్సాంలోని కామ్రూప్ జిల్లాలో 293 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3–6 ఏళ్ల వయసున్న సుమారు 7వేల మంది పిల్లలకు వారానికి రెండుసార్లు వండిన ఆహారంలో చిన్న చేపల పొడిని కలిపిన పైలట్ నిర్వహించారు. ఒడిశాలోనూ మయూర్భంజ్ జిల్లాలోని కప్తిపద బ్లాక్‌లో 50 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3–6 ఏళ్ల పిల్లలకు అందించే హాట్ కుక్డ్ మీల్స్‌లో చిన్న చేపల పొడిని చేర్చే పైలట్ 2021లో నిర్వహించారు.
మహిళా సంఘాల చేతికి తయారీ?
తెలంగాణలో ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే సెర్ప్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ఫిష్ పౌడర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇదే మోడల్ అమలైతే రెండు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఒకవైపు స్థానికంగా లభించే చిన్న చేపలకు విలువ పెరగడం.. మరోవైపు గ్రామీణ మహిళా సంఘాలకు విలువ ఆధారిత ఆహార ఉత్పత్తి తయారీ ద్వారా ఉపాధి కల్పించడం. మత్స్యసహకార సంఘాలకు సైతం అప్పగించినా వారికి ఉపాధి పెరిగి ఆర్థికంగా బలోపేతం కానున్నారు.ఒడిశాలో చేపల ఆధారిత ఉత్పత్తుల తయారీలో మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేసిన అనుభవం ఉంది. అక్కడ మిషన్ శక్తి ఆధ్వర్యంలో మహిళా సంఘాలను పరిశుభ్రమైన ఎండుచేపలు, చేపల ఆధారిత ఉత్పత్తుల తయారీతో అనుసంధానించే ప్రయత్నాలు జరిగాయి.
మత్స్యకారులకు కొత్త మార్కెట్
ఫిష్ పౌడర్ కార్యక్రమం విస్తృతంగా అమలైతే చిన్న స్వదేశీ చేపలకు కొత్త డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వాణిజ్యపరంగా పెద్దగా విలువ లభించని కొన్ని చిన్న చేపలను మత్స్యకారుల నుంచి సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి విలువ ఆహార, పోషక భద్రతతోపాటు మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి కీలక రంగంగా ప్రభుత్వం పేర్కొంటోంది. రాష్ట్రంలో పెద్ద, మధ్య, చిన్న జలాశయాలతోపాటు వేలాది చెరువులు మత్స్య సంప ఆధారిత ఉత్పత్తిగా మార్చవచ్చు. తెలంగాణలో మత్స్యరంగం ఆహార, పోషక భద్రతతోపాటు మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి కీలక రంగంగా ప్రభుత్వం పేర్కొంటోంది. రాష్ట్రంలో పెద్ద, మధ్య, చిన్న జలాశయాలతోపాటు వేలాది చెరువులు మత్స్య సంపదకు ఆధారంగా ఉన్నాయి.
నాణ్యతే కీలకం
ఫిష్ పౌడర్‌ను చిన్నారులకు అందించాలంటే నాణ్యత, పరిశుభ్రత, భద్రత విషయంలో కఠిన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. చేపల ఎంపిక, శుభ్రపరచడం, ఎండబెట్టడం, గ్రైండింగ్, ప్యాకేజింగ్, నిల్వ.. ప్రతి దశలో ప్రమాణాలు నిర్దేశించాల్సి ఉంటుంది.అస్సాం ప్రయోగంలో చిన్న చేపల పొడి నాణ్యతను విశ్లేషించేందుకు అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ భాగస్వామ్యమైంది. అదే తరహాలో తెలంగాణలోనూ ఫిష్ పౌడర్ తుది రూపు దాల్చే ముందు పోషక విలువలు, ఆహార భద్రత, పిల్లల ఆమోదయోగ్యత, నిల్వ కాలం, తయారీ వ్యయం వంటి అంశాలపై సమగ్ర పరీక్షలు అవసరం. అందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భాగస్వామ్యం తీసుకోనున్నట్లు సమాచారం.
‘ఫిష్ పౌడర్’పై కసరత్తు
చిన్న చేపలను వృథా కాకుండా వినియోగించడంతోపాటు వాటి పోషక విలువలను చిన్నారుల ఆహారంలోకి తీసుకురావడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా ఫిష్ పౌడర్‌ను అభివృద్ధి చేసి, దాని నాణ్యత–పోషక విలువలను నిర్ధారించి, ఆ తర్వాత అంగన్‌వాడీలకు సరఫరా చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మత్స్యశాఖ–మహిళా శిశు సంక్షేమశాఖ–సెర్ప్–పోషకాహార నిపుణులు సమన్వయంతో విధివిధానాలు ఖరారైతే.. తెలంగాణ అంగన్‌వాడీల్లో చిన్న చేపలతో తయారైన కొత్త పోషకాహార ఉత్పత్తి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: హైదరాబాద్‌కు బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!