Employees JAC: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో సచివాలయంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుతో సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జరిపిన కీలక చర్చలు ఎలాంటి ముగింపు లేకుండానే అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల లీడర్లు వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వి. రాజశేఖర్, మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల వైఖరిపై కఠిన చర్యలు
ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పష్టమైన హామీలు రాకపోవడం, ప్రధాన డిమాండ్లపై స్పందించకపోవడంతో జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తితో సచివాలయం నుంచి వెనుదిరిగారు. కొత్త వేతన సవరణ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకుని, పీఆర్‌సీని ఆలస్యం చేయకుండా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అంతేగాక సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలులో ఆస్పత్రుల నిర్లక్ష్యం, అధికారుల వైఖరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు ఉచిత వైద్యం..
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్‌నే వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం నెలకు కనీసం రూ.2 వేల కోట్లను విడుదల చేయాలన్నారు. ఇందులో సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు 50 శాతం, రిటైర్డ్ ఉద్యోగులకు 50 శాతం నిధులు కేటాయించాలన్నారు.
డిప్యూటీ సీఎం అందుబాటులో లేకపోవడంతో వాయిదా..
ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎస్ సంజయ్ జాజు సానుకూలంగా స్పందిస్త.. పీఆర్‌సీ నివేదికను ఈ నెలాఖరులోగా తెప్పించుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఆర్థికపరమైన కీలక డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో చర్చించాల్సి ఉందని సీఎస్ వెల్లడించారు. మొదట సోమవారం రాత్రి 7.30 గంటలకు మరోసారి సమావేశం కావాలని భావించినప్పటికీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుపతి పర్యటనలో ఉండటంతో ఈ భేటీ వాయిదా పడింది. డిప్యూటీ సీఎం అందుబాటులోకి వచ్చిన అనంతరం మంగళవారం సాయంత్రం మరోసారి సీఎస్, జేఏసీ నేతల మధ్య సమగ్ర సమావేశం జరగనుంది.
అక్టోబర్ 2 నుంచి సత్యాగ్రహ దీక్ష..
ప్రభుత్వం తీరుతో అసంతృప్తిగా ఉన్న జేఏసీ నాయకత్వం ఈసారి ఎలాగైనా సమస్య తేల్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉంది. మంగళవారం నాటి చర్చల్లో కూడా స్పష్టమైన ప్రకటన రాకపోతే, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సరికొత్త పోరాట రూపానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది.సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా.. నాయకత్వ స్థాయిలో మాత్రమే నిరసన తెలపాలని జేఏసీ యోచిస్తోంది. ఇందులో భాగంగా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా “సత్యాగ్రహ దీక్ష” చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ దీక్షలో పాల్గొంటారు.డిమాండ్లు నెరవేరే వరకు ఈ సత్యాగ్రహ దీక్షను నిరవధికంగా కొనసాగించి, ప్రభుత్వాన్ని నిలదీయాలని జేఏసీ వ్యూహం రచిస్తోంది.గతంలో ప్రతిపాదించిన ‘చలో హైదరాబాద్’ను వాయిదా వేసిన నేపథ్యంలో, ఈసారి జేఏసీ నాయకులే స్వయంగా రంగంలోకి దిగి సత్యాగ్రహ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మంగళవారం సాయంత్రం జరగబోయే కీలక భేటీపైనే ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగ వర్గాల దృష్టి నెలకొంది.
Also Read: చిన్న చేపలతో పెద్ద మేలు.. మత్స్యశాఖ తెస్తున్న ఈ స్పెషల్ పౌడర్ ప్రత్యేకత ఏంటో తెలుసా?