Mamnoor Airport : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ రాసినట్లుగా తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి కోమటి రెడ్డి వెల్లడించారు.
గత పదేళ్లుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెండింగ్ లో ఉండడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం.. జీఎంఆర్ సంస్థతో చర్చలు జరిపింది. బోర్డు మీటింగ్ లో ఈ అంశాన్ని పెట్టించారు. HIAL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ నిరభ్యంతర పత్రాన్ని మంజూరు చేసింది.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం అధికారికంగా ఆమోదించిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీంతో.. మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగనుందని వెల్లడించారు. ఏదైనా ఓ ఎయిర్పోర్టు ఉంటే.. దాని పరిధిలో అంటే చుట్టుపక్కల 150 కిలోమీటర్ల రేడియస్ లో మరో ఎయిర్పోర్టు ఉండేందుకు చట్టం అంగీకరించదు. అలా చేయాలంటే.. సదరు ఎయిర్పోర్టు నుంచి అనుమతి సాధించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు.. జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను అందించలేదు. కానీ.. ప్రస్తుతం ప్రభుత్వ చొరవతో అడ్డంకులు తొలగినట్లు మంత్రి వెల్లడించారు.
మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం.. విమానాశ్రయ ప్రాధికార సంస్థ (AAI)కి అప్పగించేందుకు సిద్ధమైందని తెలిపారు. ఇందుకోసం.. ఇప్పటికే..205 కోట్ల నిధుల్ని విడుదల చేసామని మంత్రి వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మించేటప్పుడు కేంద్రంతో హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. HIAL సంస్థ చేసుకున్న ఒప్పందంలోని క్లాజ్ 5.2 లో 25 సంవత్సరాల లోపల, 150 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి, మరో కొత్త దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని నిబంధన పెట్టుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి అభ్యర్ధన మేరకు HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు.
Also Read : HCU Accident : సెంట్రల్ యూనివర్శిటీలో కూలిన భవనం – శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు