Centre Rejects Plea Seeking Inter Cadre Change By Ias Amrapali Kata: తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషనర్’గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటాకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సారథి ఆమ్రపాలిని తన సొంత క్యాడర్ అయిన ఏపీకి వెళ్లాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కేడర్ కోసం ఆమ్రపాలి కాటా చేసిన అభ్యర్థనను సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
అమ్రపాలి కాటాతో పాటు మరో 10 మంది ఐఏఎస్ అధికారులను వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని, ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎస్’లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్’లకు తెలంగాణ కేడర్’గా మార్చాలని కేంద్రాన్ని అభ్యర్థించగా, ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు సదరు అధికారులందరినీ ఏపీ సర్కారుకు రిపోర్ట్ చేయాలని కేంద్రంలోని డీఓపీటీ ఆదేశించింది. జాబితాలో తెలంగాణ విద్యుత్శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి తదితరులు ఉండటం గమనార్హం.
ఖండేకర్ కమిటీ సిఫార్సులే…
2010 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి, తనను తెలంగాణ నివాసంగా పరిగణించాలని కోరారు. దీంతో ఖండేకర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా విచారించిన కేంద్రం, అభ్యర్థనను తిరస్కరించింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఐఏఎస్ అధికారుల కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగానే ఏపీగా ఉన్న తన క్యాడర్ ను తెలంగాణకు మార్చుకోవాలని భావించిన ఆమ్రపాలి, కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో క్యాడర్‌లను మార్చుకోవాలన్న ఆమె అభ్యర్థన పరిధికి మించినట్లు గుర్తించినట్లు ఖండేకర్ కమిటీ కేంద్రానికి సూచించింది.
Also read : MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..
అప్పుడు విశాఖ, ఇప్పుడు హైదరాబాద్…
ఆమ్రపాలి, తన యూపీఎస్‌సీ ఫారమ్‌లో తన “శాశ్వత చిరునామా”ను విశాఖపట్నంగా పేర్కొన్నారని వివరణాత్మక నివేదికలో భాగంగా ఖండేకర్ కమిటీ గుర్తించింది. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్ అధికారుల ప్రాథమిక కేటాయింపులను చేపట్టిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఆమె అభ్యర్థనపై కమిటీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. కమిటీ వాదనలతో ఏకీభవించిన కేంద్రం, ఐఏఎస్ ల అభ్యర్థనను తోసిపుచ్చింది.ట
ఏపీకి తప్పదు
ఈ విషయంలో హైకోర్టు మార్గదర్శకాలకు సైతం కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని కమిటీ పునరుద్ఘాటించింది. అమ్రపాలి కేటాయింపులు వాస్తవ రికార్డుల ఆధారంగానే ఉన్నాయని, విభజన సమయంలో అధికారులందరికీ అదే ప్రమాణాలు వర్తిస్తాయని ఖండేకర్ కమిటీ తేల్చిచెప్పింది. దీంతో ఆమ్రపాలి కాటా సహా ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా తిరిగి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి మారాల్సి ఉంది.
సోమేష్ కుమార్ దారిలో మరికొందరు ?
ఏపీకి కేటాయించిన సీనియర్ ఐఏఎశ్ సోమేష్ కుమార్, తెలంగాణలోనే సుదీర్గకాలం పనిచేశారు. ఇక క్యాట్ ఆదేశాలనే హైకోర్టు బలపర్చడంతో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే దారిలో ఆయా అదేశాలు అందుకున్న ఆఫీసర్లు ఏపీ ప్రభుత్వంలో చేరాల్సి ఉంది.