CM Revanth Reddy: బనకచర్ల.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఎవరికి నష్టం లేదన్నది ఏపీ వాదన. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే తమకు నష్టమన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. దీంతో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇలా వివాదస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర నీటిపారుదలశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు మాజీ సీఎం కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే రోజా ఇంటికెళ్లి రాగి సంకటి, చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చి చెప్పారు.
గత ప్రభుత్వ నిర్ణయాలు మనకు గుదిబండలా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద జలాలను తరలిస్తే తెలంగాణకు ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోందని.. నికర జలాల్లో తమ వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోందంటున్నారు సీఎం రేవంత్. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోందని.. తమకు మొదటి పంటకే నీళ్లు లేవు అంటున్నారు సీఎం రేవంత్.
తెలంగాణ జలాల విషయంలో రాజీపడేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి హక్కులను కాపాడాల్సింది పోయి.. రాష్ట్రానికి నష్టం చేశారని కేసీఆర్, హరీష్ రావుపై మండిపడ్డారు. వాళ్ల సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయన్నారు. చంద్రబాబు, జగన్‌తో కుమ్మక్కై నీటి వాటాలను ఏపీకి కట్టబెట్టారని ఆరోపించారు. హక్కులు కాపాడుకునేందుకు కేంద్రపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రులే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలని క్షుద్రపూజలు చేసినట్లు.. కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అబద్ధాల వల్లే 2023లో కేసీఆర్ అధికారం కోల్పోయారు. 2024లో డిపాజిట్లు కోల్పోయారని సీఎం తెలిపారు. లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించి.. 50 వేల ఎకరాలకే నీరు ఇచ్చారన్నారు. 2007లో 34 వేల కోట్లతో గోదావరిపై అతిపెద్ద ప్రాజెక్టు ప్రాణాహిత, చేవెళ్లను ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఊరు, పేరు, అంచనాలు మార్చేసి లక్షన్నర కోట్లతో కాళేశ్వరం అన్నారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం బనకచర్ల చేపట్టడానికి కారణం కేసీఆరే అని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: చిన్న పిల్లలు ఉన్నారు భోజనం, బస ఏర్పాట్లు చెయ్యండి.. సీఎం కీలక ఆదేశాలు
మరోవైపు గోదావరి, కృష్ణ జలాల్లో ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నాయి ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణ జలాల విషయంలో బీఆర్‌ఎస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీకి నీళ్లు తరలించేందుకు బీఆర్‌ఎస్ ఒప్పందం చేసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కృషి వల్లే బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాధనను కేంద్రం వెనక్కు పంపిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.