CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలోనే ఇందిరమ్మ రాజ్యానికి పునాది పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజక న్యాయ సమరభేరీ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘మా ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అన్నారు. సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు అమలు చేయరని ప్రచారం చేశారు. కాంగ్రెస్ వాళ్లు కలిసి ఉండరని.. కొట్టుకుంటారని అన్నారు. తెలంగాణలో తిరుగులేదనుకుని విర్రవీగిన బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాం. మూడు రంగుల జెండా చేతబట్టి 4 కోట్ల మందిని చైతన్యపరిచాం. 15 నెలల్లోనే కులగణన చేసి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టాం. దెబ్బ తిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగుతున్నాం. కలిసికట్టుగా ముందుకెళ్తూ.. అందరి అపోహలు పటాపంచలు చేశాం’ అని సీఎం వ్యాఖ్యానించారు.
తొలి ఏడాది 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. కిషన్‌రెడ్డి, కేసీఆర్.. దమ్ముంటే ఉద్యోగ నియామకాలపై చర్చకు రావాలి.. 60 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా.. నేను క్షమాపణ చెబుతా. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధపడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ చూసుకుంటుంది.. మంత్రులుగా చేసే బాధ్యత ఖర్గే, రాహుల్ గాంధీ చూసుకుంటారు.. టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు.. మీకు టికెట్లు ఇచ్చి దారిఖర్చులు కూడా ఇచ్చి పంపుతాం.. ఖర్గేకి మాట ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Mallikarjuna Kharge: బీఆర్ఎస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించారు: మల్లికార్జున ఖర్గే
రైతు రాజ్యం ఎవరిదో పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదాం. మోదీ వస్తారో? కేసీఆర్ వస్తారో రండి.. మేం చర్చకు సిద్ధం. రైతు భరోసా విఫలమవుతుందని గొతికాడ నక్కల్లా కొందరు ఎదురుచూశారు. కానీ 9 రోజుల్లో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేశాం. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. పేదలకు సొంత ఇళ్లు, సొంత భూమి ఉందంటే అది ఇందిరమ్మ ఇచ్చిందే’ అని చెప్పారు.
ALSO READ: Public Holiday: మొహర్రం ప్రభుత్వ సెలవు దినం ఎప్పుడు? రెండు రోజులు హాలిడే ఉంటుందా?
‘పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. అలాంటి వారిని గుడ్డలూడదీసి కొడితే కానీ బుద్ధి రాదు. అలాంటి వారికి బుద్ధి చెబితే కానీ ఇందిరమ్మ గొప్పదనం తెలియదు. సోషల్ మీడియాలో మన కార్యకర్తలు యుద్ధం ప్రకటించాలి. ఈ యుద్ధంలో కల్వకుంట్ల గడీ తునాతునకలు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత నాది’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.