CM Revanth Reddy: అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ స్కీంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలను మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.4 లక్షల వరకు మంజూరు కానుంది. దీని కోసం ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అధికారులు దరఖాస్తులను పరిశీలించనున్నారు. జూన్ 2న ప్రభుత్వం యువతకు రుణాలను అందజేయనుంది.
‘రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 55వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టి చరిత్ర సృష్టించాం. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏడాదలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి రూ.5వేల 5 కోట్లు ఖర్చు చేశాం. గృహజ్యోతి పథకంతో 50 లక్షల ఇళ్లలో వెలుగులు చూస్తున్నాం. 43 లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ది పొందుతున్నారు. కోటీ 30 లక్షల చీరలను ఆడబిడ్డలకు ఇవ్వాలని నిర్ణయించాం. కమీషన్ల కోసం కంప్యూటర్లు కొన్నారే కానీ స్కూళ్లకు కరెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ బడులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘గతంలో నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా విధానం.. ఆ విధానానికి మా ప్రభుత్వంలో స్వస్తి పలికాం. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తున్నాం. అప్పులు ఆదాయం విషయంలో అంచనాలు తప్పాయి. ఆదాయం తగ్గింది. అడ్డగోలుగా అప్పులు పెరిగిపోయాయి. అందుకే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. గతంలో వసూలు చేయాల్సిన పన్నులను కూడా వసూలు చేయలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘గతంలో ఇసుక నుంచి రోజూ రూ1.25 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డుకుట్ట వేశాం. అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపలేం. దుబారా ఖర్చులు తగ్గించాం. మంచి పాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు