Police station for Hydra: హైదరాబాద్ నగరంలో ఇక ఆటలు చెల్లవు. ఎవరైనా గీత దాటి ప్రవర్తిస్తే, ఇక కటకటాల్లోకి ఖాయం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అనే తరహాలో ఇక మున్ముందు నగరంలో పరిస్థితులు ఉండనున్నాయి. ఔను, ఇక నుండి ఇష్టారీతిన ఆక్రమణలకు పాల్పడుతామని అనుకుంటే ఇక బరువే. ఇంతకు ఎందుకు ఇంతలా చెప్పడం, అసలు విషయం ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.
ఇక అరెస్టులే..
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, రహదారులపై అక్రమ కబ్జాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. హైడ్రా (HYDRA) కు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. బుధ్ధభవన్ పక్కన నిర్మించిన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాల, కబ్జాలపై పోరాటానికి హైడ్రా ముందుండగా.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రూపంలో చట్టబద్ధ అధికారాలు కూడా లభించాయి. ఫలితంగా, అక్రమ నిర్మాణాలపై వెంటనే కేసులు నమోదు చేసి నేరస్థులను అరెస్ట్ చేసే అధికారం హైడ్రాకు వచ్చింది.
భవనమే కాదు బలగం పెద్దదే
బుధ్ధభవన్ పక్కన నిర్మించిన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ 10500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 భవనంగా నిర్మించబడింది. ఏసీపీ పి. తిరుమల్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. 6 మంది ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్ల బృందం పోలీస్ స్టేషన్ విధుల్లో ఉండనున్నారు. ఇకపై వీరు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు.
చర్యలు ఎలా?
హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది సరే, వీరు ఏం చేస్తారో తెలుసుకుందాం. చెరువుల్లోకి మురుగు నీరు వదులుతున్న వారిపై కేసులు, మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనదారులతో పాటు నిర్మాణ సంస్థలపై చర్యలు, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములపై హక్కులు పొందే వారిపై క్రిమినల్ కేసులు, వాల్టా, ఫైర్ చట్టాలను ఉల్లంఘించే వారిపై నేర ప్రక్రియ, అక్రమ కార్మికులపై హైడ్రా చర్యలు తీసుకోనుంది.
ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు అక్రమంగా తమ పరిధిలో కలిపేసుకునే వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ విచారణ చేస్తుంది. ఇప్పటికే హైడ్రా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలను కాపాడింది. వీటికి సంబంధించిన 50కి పైగా కేసులు ఇప్పటికే న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నింటిని కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్‌లోనే విచారణ జరిపే విధంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Also Read: Kamareddy: ప్రియుడి కోసం కొడుకును అమ్మేసిన తల్లి..! కామారెడ్డిలో సంచలనం
ఇప్పటి వరకు లెక్క.. ఇక ముందు
ఇప్పటి వరకు కేవలం హైడ్రా హెచ్చరికలతో సరిపెట్టింది. ఇక నుండి కేసుల వరకు భాద్యులు ఎదుర్కోవాల్సిందే. ఔను, మొన్నటి వరకు ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చి మరీ అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా, ఇకపై అక్రమార్కులకు చుక్కలు చూపించనుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త.. అక్రమ నిర్మాణాలు చేపట్టినా, ప్రభుత్వ భూములను ఆక్రమించినా ఇక చుక్కలే.