Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలు, కులగణన లాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. మీటింగ్ తరవాత ఢిల్లీలోనే బస చేసిన సీఎం.. అనంతరం అక్కడ నుండి నేరుగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరబోతున్నట్టు తెలుస్తోంది.
Also read: కలెక్టర్‌పై దాడి కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్, పరారీలో ప్రధాన నిందితుడు
ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున సీఎం ప్రచారం చేయనున్నారు. ఎన్నికలకు వారం రోజులు మాత్రమే ఉండడంతో కూటమి ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తనతో ప్రచారంలో పాల్గొనే నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించనున్నారు. ఎన్నికల సమరం కోసం ఇండియా కూటమి భారీ ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు ప్లాన్ చేసింది.
ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలను చర్చిస్తారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం రేవంత్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో రెండు మూడు సార్లు ప్రచారం చేశారు. తెలంగాణ, కర్నాటకలను రోల్ మోడల్ గా చేసుకుని కూటమి మహాలో ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను ప్రధాన అస్త్రాలుగా వాడుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సైతం కీలకంగా మారింది.