Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుందన్నారు. మా పార్టీలో ఎలాంటి అంతర్గత రాజకీయాలు లేవని ఒక్కముక్కలో చెప్పేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పని చేయడానికి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తానన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. అధినేత్రి సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
పార్టీ నేతలతో సమావేశానికి తొలిసారి ఢిల్లీ నుంచి నేరుగా ఆమె హైదరాబాద్ వచ్చారు.దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మధ్యాహ్నం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
సమావేశానికి ముందు మీనాక్షి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతలు బిజీగా ఉంటారని భావించి ఆమె రాలేదని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. గురువారం ఎన్నికలు జరగడంతో శుక్రవారం వచ్చారని చెబుతున్నాయి.
ALSO READ: ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే.. అదనంగా మూడు వేల సీట్లు
సమావేశంలో మీనాక్షి ఏయే అంశాలు ప్రస్తావిస్తారనే ఆసక్తి నేతల్లో నెలకొంది. పార్టీ వ్యవహారాలపై ఆమె ఫోకస్ చేస్తారని అంటున్నారు. కమిట్మెంట్, క్రమశిక్షణకు ప్రయార్టీ ఇస్తారని అంటున్నారు. నాయకుడు అనేవారు ఎంత సింపుల్‌గా అంత మంచిదన్నది ఆమె ఆలోచనగా చెబుతున్నాయి. ఇన్‌ఛార్జ్‌గా పార్టీ హైకమాండ్ మీనాక్షిని నియమించినా ఆమె, తెలంగాణకు రాలేదు. బయట నుంచి పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితుల గురించి ఇప్పటికే ఏఐసీసీ నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు భోగట్టా. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండుసార్లు మాత్రమే ఆన్‌లైన్ సమావేశాలు పెట్టారు. గెలుపు కోసం నేతలకు చెప్పాల్సిన విషయాలు చెప్పారు. మీనాక్షి ముక్కుసూటిగా ఉంటారని జూమ్ మీటింగ్ పాల్గొన్న కొందరు నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా కొన్ని సమస్యలున్నట్లు గుర్తించారట ఆమె. ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయ లోపం ఉందన్నది ప్రధాన కారణమట. ఇదికాకుండా పాత-కొత్త నేతల మధ్య కొంత గ్యాప్ ఉందని, ఈసారి ఆ గ్యాప్ పూర్తి చేస్తారని అంటున్నారు. కొన్నిచోట్ల, నేతలు, మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల విమర్శలు తలెత్తుతున్న విషయాన్ని గతంలో ఈమె గుర్తించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చిన సంగతి తెల్సిందే. పార్టీలో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయనున్నారన్నది కొందరి నేతల మాట. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వస్తే ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టడంలో నేతలు ఫెయిలయ్యారనే చర్చ ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ పదవులు, కొత్త కమిటీలపై ప్రస్తుత సమావేశంలో చర్చ జరగవచ్చని కొందర నేతలు సూచనప్రాయంగా చెబుతున్నారు.
ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటి..
హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో మీనాక్షి నటరాజన్ ను కలిసిన సీఎం రేవంత్
మరికాసేపట్లో గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం pic.twitter.com/Ht55ayS0ff
— BIG TV Breaking News (@bigtvtelugu) February 28, 2025